కాల్పులకు దిగినవారిలో ఓ మహిళ కూడా..

3 Dec, 2015 07:52 IST|Sakshi

శాన్ బెర్నార్డినో: అమెరికాలో తాజాగా కాల్పులకు పాల్పడిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు ఇప్పటికే హతమయ్యారని పోలీసు అధికారులు చెప్పారు. వారిలో ఓ మహిళ కూడా ఉందని వారు స్పష్టం చేశారు. హతమైన వారివద్ద భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి కాల్పులు తుపాకులు ఉన్నట్లు చెబుతున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ బెర్నార్డినో నగరంలోని ఓ సేవా కేంద్రంలోకి చొరబడ్డ ముగ్గురు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి దాదాపు 14 మంది ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే.

మరో 20మంది వరకు గాయపడ్డారు కూడా. అయితే, కాల్పులకు దిగిన వారికోసం దాదాపు 1300మంది పోలీసులు తీవ్రంగా గాలింపులు జరపగా కాల్పులకు దిగిన ముగ్గురిలో ఇద్దరు హతమైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ సమయంలోనే మరో వ్యక్తి పరుగులు తీస్తుండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడు ఉగ్రవాదా ?కాదా? అతడికి తాజా ఘటనకు సంబంధం ఉందా లేదా అనే విషయం ఇంకా నిర్దారణ కావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు