ఆ శిథిలాలు... ఆ విమానానివే !

12 May, 2016 10:20 IST|Sakshi
ఆ శిథిలాలు... ఆ విమానానివే !

కౌలాలంపూర్ : దక్షిణాఫ్రికా, మారిషస్లో దొరికిన శిథిలాలు రెండేళ్ల క్రితం అదృశ్యమైన మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన ఎమ్హెచ్ 370 విమానానివే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మలేషియా రవాణా శాఖ మంత్రి లీవో టింగ్ లాయి గురువారం మాట్లాడుతూ.... సదరు విమాన శిథిలాలను అంతర్జాతీయ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పారు. అవి గల్లంతైన ఎమ్హెచ్ 370 విమాన శిథిలాలేనని వారు పేర్కొన్నారని తెలిపారు. అలాగే ఈ శిథిలాలను దాదాపు 13 దర్యాప్తు బృందాలు పరిశీలించాయని కూడా తెలిపారు. 

ఈ ఏడాది మార్చిలో మొజాంబిక్లో దొరికిన శిథిలాలను పరిశీలించగా అవి ఎమ్హెచ్ 370 విమానంకు చెందినవే గుర్తించినట్లు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో దొరికిన ఇంజన్లోని పరికరంపై రోల్స్ రాయిస్ సంస్థ గుర్తు ఉందని.... అలాగే రోడ్రిగస్ ద్వీపంలో విమాన క్యాబిన్లోని అంతర్గత ప్యానల్ ముక్క దొరికిందని మంత్రి లీవో గుర్తు చేశారు. ఆ రెండు శిథిలాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. ఈ మేరకు మలేషియాన్ స్టార్ వెల్లడించింది.  

2014 మార్చి 8వ తేదీన ఎమ్హెచ్ 370 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్కు బయలుదేరింది. బయలుదేరిన కొద్ది గంటకే ఆ విమానం కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ రాడార్ స్క్రీన్ నుంచి మాయమైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది మొత్తం 237 మంది గల్లంతయ్యారు. ఆ విమాన ఆచూకీ కోసం... నాటి నుంచి ప్రపంచదేశాలు ఏకమై జల్లెడ పట్టిన సంగతి తెలిసిందే. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా