కాబూల్‌పై విరుచుకుపడ్డ ఉగ్రమూకలు

30 Apr, 2018 16:32 IST|Sakshi
రెండో దాడి అనంతరం కాబూల్‌లో నెలకొన్న భయానక వాతావరణం

ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు

25 మంది మృతి, 49 మందికి గాయాలు

మృతుల్లో ఆరుగురు జర్నలిస్టులు

కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌పై ఉగ్రమూకలు మరోసారి విరుచుకుపడ్డాయి. సోమవారం నిమిషాల వ్యవధిలో జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో  40 మంది మృతి చెందగా, 49 మంది గాయపడినట్టు స్థానిక అధికారులు ప్రకటించారు. మృతుల్లో ఆరుగురు జర్నలిస్టులు ఉన్నట్టు సమాచారం. ఈ దాడిలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అదికారులు తెలిపారు. తొలుత ఉదయం 8 గంటల ప్రాంతంలో అఫ్ఘాన్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ ప్రధాన కార్యలయం సమీపంలో మోటర్‌ సైకిల్‌పై వచ్చిన ఉగ్రవాది పేలుళ్లకు పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. మీడియా ప్రతినిధులు కూడా ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

అయితే ఆ సమయంలో వారిలో ఒకరిగా కలిసిపోయిన మరో తీవ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. మొదటి దాడి జరిగిన కొద్ది సేపటికే రెండో దాడి చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ రెండు ఘటనల్లో పలువురు జర్నలిస్టులతో సహా 25 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ ఏఎఫ్‌పీకి చెందిన ప్రముఖ ఫొటోగాఫర్‌ షా మారై కూడా ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. వారం రోజుల క్రితం ఓటరు నమోదు కేంద్రం లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రసంస్థ జరిపిన దాడిలో 30 మంది పౌరులు మరణించారు.

మరిన్ని వార్తలు