రెండేళ్ల బుడ్డోడు.. ఇలా హీరో అయ్యాడు!

4 Jan, 2017 11:40 IST|Sakshi
రెండేళ్ల బుడ్డోడు.. ఇలా హీరో అయ్యాడు!

వాషింగ్టన్: ఓ రెండేళ్ల అమెరికా బుడ్డోడు రాత్రికి రాత్రే హీరో అయ్యాడు. తన కవల సోదరుడిని రక్షించేందుకు చేసిన ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఉతాలోని ఒరెమ్ సిటీకి చెందిన కేళీ షాఫ్ దంపతులకు సంతానం ఇద్దరు కవలలు. వారి పేర్లు బౌడీ షాఫ్, బ్రాక్ షాఫ్. అయితే గత శుక్రవారం వీరిద్దరూ ఇంట్లో సరదాగా అడుకుంటున్నారు. ఇంతలో వీరికి ఓ చిక్కు వచ్చి పడింది. వీరు ఆడుకుంటుండగా డ్రెస్సింగ్ డేబుల్ వారిపై పడింది. అయితే బౌడీకి కాళ్లమీద పడటంతో వెంటనే ఎలాగోలాగ తప్పించుకున్నాడు. అప్పుడు మొదలైంది అసలు పోరాటం.. తాను తప్పించుకున్నాడు కానీ, సోదరుడు బ్రాక్ షాఫ్ బాడీపై ఆ టెబుల్ అలాగే ఉండిపోయింది. దీంతో టేబుల్ కింద నానా తిప్పలు పడ్డాడు.

టేబుల్ ను పక్కకు జరిపేందుకు బౌడీ చేసిన ప్రయత్నాన్ని మనం వీడియోలో చూడవచ్చు. దాదాపు రెండు నిమిషాల పాటు కష్టపడి బ్రాక్ ను గండం నుంచి గట్టెక్కించాడు. మొదట టేబుల్ ను ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమైన బౌడీ.. అలాగే కొద్దిసేపు పోరాడి టేబుల్ ను కాస్త పక్కకు జరపగా వెంటనే బౌడీ పక్కకు జరిగి హమ్మయ్యా అనుకున్నాడు. ఈ వీడియోను వీరి ఫాదర్ రికీ షాఫ్ తన ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దాంతోపాటుగా ఓ మెసేజ్ ఇచ్చారు. డేబుల్స్, ఇతర వస్తువులు ఏమైనా ఉంటే వాటిని గోడకు అటాచ్ అయ్యేలా చూసుకుంటే ఇలాంటి ఘటనలు తలెత్తవని సూచించారు. పిల్లలు ఆడుతూ అల్లరి చేస్తున్నారని మేము భావించాం.. కానీ సీసీటీవీ చూస్తే జరిగింది వేరు అని పోస్ట్ లో పేర్కొన్నాడు. లైట్ వెయిట్ టేబుల్ కావడంతో ప్రమాదం తప్పిందని రికీ షాప్ అన్నారు. మొత్తానికి రెండేళ్ల బుడ్డోడు బ్రాక్.. కవల సోదరుడి కోసం చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.