టైప్ రైటర్లు మళ్లీ వచ్చేస్తున్నాయోచ్!

22 Jul, 2014 20:21 IST|Sakshi
టైప్ రైటర్లు మళ్లీ వచ్చేస్తున్నాయోచ్!

కంప్యూటర్లు, లాప్ టాప్ లు, టాబ్ ల యుగంలో టైప్ రైటర్లకు పనేంటి అనుకుంటున్నారా? ఆధునిక లైఫ్ లో డైనోసార్ల లాంటి మెషిన్ అవసరం ఏమిటి అనుకుంటున్నారా? అవసరం ఉందంటున్నారు జర్మన్లు. అందుకే జర్మనీలో ఇప్పుడు టైప్ రైటర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి.


అమెరికా గూఢచర్యం నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు జర్మన్లు టైప్ రైటర్లపైనే ఆధారపడుతున్నారు. ఎందుకంటే అమెరికా జాతీయ భద్రతా సంస్థ ఎన్ ఎస్ ఏ ఏకంగా జర్మనీ చాన్స్లర్ ఎంజిలా మెర్కెల్ ఫోన్ నే ట్యాప్ చేసింది. చాలా మంది రాజకీయనాయకుల ఫోన్లను, ఈ మెయిల్ ఎకౌంట్లను, వెబ్ సైట్లను కూడా అమెరికా నిఘావేసి చూస్తోంది. దీంతో ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా గూఢచర్యం చేయడం సులువని జర్మన్లు గుర్తించారు. అందుకే టైప్ రైటర్ల యుగానికి వెళ్లిపోదాం అని వారు నిర్ణయించుకున్నారు.


ఒలింపియా, బాందెర్మాన్ కంపెనీల టైప్ రైటర్లకు ఇప్పుడు భారీగా గిరాకీ పెరిగింది. తమకు 10000 కి పైగా ఆర్డర్లున్నాయని ఆ కంపెనీలు చెబుతున్నాయి. టైప్ రైటర్ ను బగ్ చేయడం, ట్యాప్ చేయడం అసాధ్యం కాబట్టి దీన్నే వాడమని జర్మన్ రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారట. అందుకే జర్మనీలో టైప్ రైటర్లు వచ్చేశాయోచ్!



 

మరిన్ని వార్తలు