జపాన్‌లో టైఫూన్‌ బీభత్సం

14 Oct, 2019 03:29 IST|Sakshi

టోక్యో: జపాన్‌ను హగిబీస్‌ టైఫూన్‌ వణికిస్తోంది. టైఫూన్‌ ధాటికి 33 మంది మృతిచెందగా.. 15 మంది జాడ తెలియకుండా పోయింది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆదివారం కురిసిన భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లడంతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి.  చికుమా నది పొంగిపొర్లడంతో సెంట్రల్‌ జపాన్‌లోని నాగానో సహా పరిసర ప్రాంతాలు నీటమునిగాయి. దాదాపు 1.10 లక్షల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. భారీ వర్షాల కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి.

వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు మిలటరీ, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.  ఆదివారం నమీబియా–కెనడా దేశాల మధ్య జరగాల్సిన రగ్బీ వరల్డ్‌ కప్‌ మూడో టోర్నమెంట్‌ మ్యాచ్‌ను రద్దు చేశారు. తుపాను ధాటికి జపాన్‌లోని హోన్షు ద్వీపం తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ గంటకు 216 కి.మీ వేగంతో పెనుగాలులు వీశాయి. ఇటీవలి కాలంలో జపాన్‌లో వచ్చిన  తీవ్రమైన టైఫూన్లలో హగిబీస్‌ ఒకటి. ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జపాన్‌ ప్రధాని షింజో అబేతెలిపారు. టైఫూన్‌ మృతులకు భారత ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.
జపాన్‌లోని కకుడాలో ధ్వంసమైన రోడ్డు

>
మరిన్ని వార్తలు