ఐఎస్ ఐఎస్ డబ్బును ధ్వంసం చేసిన అమెరికా దళాలు

13 Jan, 2016 20:11 IST|Sakshi
ఐఎస్ ఐఎస్ డబ్బును ధ్వంసం చేసిన అమెరికా దళాలు

ఉగ్రవాదాన్ని అణచి వేసేందుకు ఆమెరికా నిర్విరామంగా కృషి చేస్తోంది. ఐఎస్ ఐఎస్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా ఇరాక్ సెంట్రల్ మోసుల్ లోని ఓ భవనంపై రక్షణ దళాలు బాంబుల వర్షం కురిపించాయి. ఐఎస్ ఐఎస్ భవిష్యత్ కార్యాచరణకోసం డబ్బు దాచిపెట్టిన భవనాన్ని యూఎస్ దళాలు ధ్వంసం చేశాయి. అయితే భవనంలో ఎంత మొత్తం డబ్బు, ఏ దేశానికి చెందిన కరెన్సీ ఉంది అన్న విషయాలను మాత్రం రక్షణ అధికారులు వెల్లడించలేదు. కాగా ఆ డబ్బు మిలియన్లలోనే ఉందని వివరాలను బట్టి తెలుస్తోంది.

రెండువేల పౌండ్ల బరువున్న రెండు బాంబులు... డబ్బు దాచిపెట్టిన భవనాన్నిక్షణాల్లో ధ్వంసం చేశాయి. ఐఎస్ ఐఎస్ సామర్థ్యాన్ని తగ్గించేందుకు వారి ఆర్థిక స్థావరాలను నాశనం చేయడమే  అమెరికా అక్ష్యంగా  చేసుకుందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్లక్రితం యూఎస్ యుద్ధ విమానాలు ఐఎస్ ఐఎస్ చమురు ట్రక్కులను కూడ టార్గెట్ చేశాయని అంటున్నారు. అయితే ప్రస్తుత మోసుల్ దాడుల్లో సాధారణ ప్రజలు కూడా మరణించే ప్రమాదం ఉండటంతో ఈ విధ్వంసాన్ని అమెరికా సున్నితంగా భావించింది. అందుకే చాలాకాలంపాటు డబ్బు సేకరణ, పంపిణీ స్థావరంపై డ్రోన్లు, విమానాలతో నిఘా పెట్టింది. చివరికి అక్కడ జన సంచారం లేని సమయాన్ని కనిపెట్టి దాడులు నిర్వహించింది. అయితే ఆ స్థావరాన్ని అమెరికా ఎలా కనిపెట్టింది అన్న విషయం బహిర్గతం కాలేదు.

బాంబు దాడుల ప్రాంతానికి సమీపంలో సాధారణ పౌరులు పగటి సమయంలో మాత్రమే ఉండటం, రాత్రిళ్ళు ఐఎస్ ఐఎస్ సిబ్బంది పనిచేస్తుండటం గమనించిన నిఘా అధికారులు ఆదివారం తెల్లవారుజామున దాడులు జరిపేందుకు నిర్ణయించారు. అయితే తమ లక్ష్యాన్ని సాధించేందుకు సుమారు 50మంది వరకు సాధారణ పౌరులు బలికాక తప్పదని తాము యోచించినట్లు కమాండర్లు ఒప్పుకుంటున్నారు. కాగా దాడిలో ఐదు నుంచి ఏడుగురు మాత్రమే మరణించినట్లు చెప్తున్నారు. ఇదిలా ఉంటే అమెరికా తన లక్ష్యాలను అమలుపరిచే నేపథ్యంలో మరింత మంది సాధారణ ప్రజలు బలయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు