హెచ్‌1బీ పరిమితి : అలాంటిదేమీ లేదు

21 Jun, 2019 14:17 IST|Sakshi

వాషింగ్టన్‌ : హెచ్‌1బీ వీసాలపై పరిమితులు విధించేందుకు అమెరికా ప్రభుత్వం యోచిస్తోందన్న అంచనాలపై ట్రంప్‌ సర్కార్‌ స్పందించింది.  ప్రస్తుతానికి అలాంటి పరిమితులు విధించే ఆలోచన లేదని  స్పష్టం చేసింది.  ఈ మేరకు విదేశాంగ శాఖ గురువారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

డేటా స్థానికీకరణ అడిగే దేశాలపై  హెచ్‌ 1 బీ వీసాలపై  పరిమితులు విధించాలనే ప్రణాళికలేవీ లేవని ప్రకటించింది. హెచ్ -1 బి వీసీ ప్రోగ్రామ్‌తో,  వర్క్‌ వీసా జారీ ప్రక్రియను విస్తృతంగా సమీక్షించాలని యోచిస్తున్నప్పటికీ   ఇది ఒక నిర్దిష్ట దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని  విదేశాంగ ప్రతినిధి తెలిపారు.  నిక్షిప్తమైన డేటాకు సంబంధించి  ఇండియాతో చర్చించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి...కానీ అది వీసాలపై ఎంతమాత్రం ప్రభావం చూపదని ఆమె వెల్లడించారు.

దేశంలోని చెల్లింపుల కంపెనీలన్నీ ఇక్కడే తమ వినియోగదార్ల సమాచారాన్ని నిల్వ చేయడాన్ని గతేడాది భారత్‌ తప్పనిసరి చేసింది. అయితే అందుకు అదనపు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని కొన్ని అమెరికా కంపెనీలు ఆ నిబంధనను వ్యతిరేకిస్తున్నాయి. దీంతో అమెరికా మన భారతీయ ఐటీ నిపుణులు ఆ దేశంలో పనిచేయడానికి వీలు కల్పించే హెచ్‌1-బీ వీసాలపై పరిమితులు విధించాలని భావించినట్లు బుధవారం  మీడియా నివేదికలు  ఆందోళనలు రేపాయి. దీనిపై గురువారం ట్రంప్‌ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

మరిన్ని వార్తలు