విదేశీ కార్మికులకు క్షమాభిక్ష

2 Aug, 2018 04:00 IST|Sakshi

యూఏఈ ప్రభుత్వ నిర్ణయం

తొలిరోజు ముగ్గురు భారతీయుల దరఖాస్తు

దుబాయ్‌: గడువు తీరిన తర్వాత దేశంలో నివసిస్తూ పట్టుబడిన కార్మికులకు యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. ఇందులో భాగంగా 3 నెలల క్షమాభిక్ష కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న లక్షల మంది భారతీయులు సహా విదేశీ కార్మికులకు ఇది లబ్ధిచేకూర్చనుంది. ఈ కార్యక్రమం ద్వారా జరిమానాల్లేకుండా దేశం విడిచి వెళ్లడం లేదా ఆర్నెల్లలో ఉద్యోగం వెతుక్కునే చాన్సుంటుంది. యూఏఈ అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశంలో 28లక్షల మంది భారతీయ వలసదారులున్నారు.

ఇందులో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు 15–20% కాగా, 20 శాతం మంది వివిధ ఉద్యోగాల్లో మంచి స్థానాల్లో ఉన్నారు. మిగిలిన 65% మంది వివిధ పరిశ్రమల్లో కార్మికులు. ఆగస్టు 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు క్షమాభిక్ష అమల్లో ఉంటుందని ఈ మధ్యలోనే అక్రమంగా ఉంటున్న వారు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని యూఏఈ గుర్తింపు, పౌరసత్వ సంస్థ స్పష్టం చేసింది. ఈ దిశగా దేశ వ్యాప్తంగా కమ్యూనిటీ సెంటర్లు, వివిధ బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కేంద్రాలను ఏర్పాటుచేశారు.

బుధవారం ముగ్గురు భారతీయులు అబుదాబిలోని బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో క్షమాభిక్ష కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. తొలిరోజే కావడంతో సంఖ్య పలుచగా ఉందని.. రానున్న రోజుల్లో మరింత మంది రావొచ్చని భావిస్తున్నారు. యూఏఈలో ఉన్న భారత కార్మికుల్లో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వారే ఉన్నారు. ‘క్షమాభిక్ష గురించి సమాచారం తెలిసింది. స్వామి అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఏ1 ఆమ్నెస్టీ సెంటర్‌లో దరఖాస్తు చేసుకున్నారు. యూఏఈలో యజమాని.. భారత్‌లో ఉన్న తన కుటుంబసభ్యులతో మాట్లాడనివ్వనందునే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానని లక్ష్మీదేవి రెడ్డి అనే మహిళ పేర్కొన్నారు. జూన్‌లోనే తన ఔట్‌పాస్‌ గడువు ముగిసిందని ఆమె తెలిపారు. యజమాని తనపై కేసు వేసినందున పోలీసు క్లియరెన్స్‌ రాలేదని.. మరోసారి దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆమె చెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా