నా పెళ్లి ఎప్పుడో అయిపోయిందిగా..!!

11 Oct, 2018 08:37 IST|Sakshi

లులూ జెమియా.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థిని... మొన్న ఆగస్టుతో ఈమెకు 32 ఏళ్లు నిండాయి.. అయితే మామూలుగా అందరికీ ఎదురయ్యే ప్రశ్నే లులూకూ, ఆమె తల్లిదండ్రులకు ఎదురైంది. పెళ్లెప్పుడు.. ఈ ప్రశ్న వినీ వినీ విసిగిపోయిన లులూ.. తల్లిదండ్రుల కోసం వధువుగా మారింది. వరుడు లేకుండానే వివాహ తంతు పూర్తి చేసుకుంది. అదేంటి అలా ఎలా అనుకుంటున్నారా?

‘నాకు పదహేరేళ్లు వచ్చిన నాటి నుంచే మా నాన్న నాకోసం వెడ్డింగ్‌ స్పీచ్‌ రాయడం మొదలు పెట్టాడు. ఇక మా అమ్మ అయితే నా ప్రతీ పుట్టిన రోజున ప్రార్థనలతో ఆ దేవుడిని ప్రాధేయపడేది. నన్ను ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా చూసుకునే భర్త రావాలని మొరపెట్టుకునేది. కానీ నాకు మాత్రం ఇన్నేళ్ల జీవితంలో అలాంటి వ్యక్తి ఒక్కరూ తారసపడలేదు. అలా అని అమ్మానాన్నల ఆశను తీర్చకుండా ఉండలేను. అందుకే ఈ పుట్టిన రోజున(ఆగస్టు 29) నన్ను జాగ్రత్తగా చూసుకునే నా సోల్‌మేట్‌ని వివాహమాడాను. అదెవరో కాదు లులూ జెమియానే. అంటే నేనే’  అంటూ తనను తానే పెళ్లాడిన లులూ చెప్పుకొచ్చింది. గోఫండ్‌మీ అనే పేజీ క్రియేట్‌ చేసి తన పెళ్లికి ఖర్చులకు డబ్బులు సమకూర్చుకున్న లులూ.. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. సోదరుడు తన కోసం తయారు చేసిన కేక్ కట్‌ చేసి బర్త్‌డేతో పాటుగా వెడ్డింగ్‌ను కూడా సెలబ్రేట్‌ చేసుకుంది. అయితే తల్లిదండ్రులు తన పెళ్లి చూడలేకపోయారనే లోటు మాత్రం మిగిలిపోయిందట.

తమకు చెప్పకుండా లులూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు షాకయ్యారు. లులూతో మాట్లాడటం మానేశారు. కానీ ఎలాగైతేనేం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అయితే తనకు వచ్చింది. ‘మా కోసం ఇలాంటి వింత నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడింది. కాబట్టి త్వరలోనే మనసు మార్చుకుంటుంది. ఈసారి జరిగే పెళ్లిలో తన పక్కన వరుడు కూడా ఉండాలి దేవుడా’ అంటూ మళ్లీ ప్రార్థించడం మొదలుపెట్టారు. మరి ఆ తల్లిదండ్రుల కోరిక ఎప్పుడు నెరవేరుతుందో!?

మరిన్ని వార్తలు