'నా సోద‌రిని చైనా నిర్బంధించింది'

9 Jul, 2020 09:44 IST|Sakshi

ఉఘ‌ర్ ముస్లిం మ‌హిళ‌ల‌పై చైనా అరాచ‌కం

వారిపై అత్యాచారం, ఆపై బ‌ల‌వంత‌పు పెళ్లిళ్లు

న్యూఢిల్లీ: మైనారిటీల‌ను చైనా ప్ర‌భుత్వం హింసిస్తోంద‌ని అమెరికా సామాజిక‌వేత్త రుషాన్ అబ్బాస్ పేర్కొన్నారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 2018లో సెప్టెంబ‌ర్ 28న త‌న సోద‌రి, మెడిక‌ల్ డాక్ట‌ర్‌ గుల్షాన అబ్బాస్‌ను చైనా ప్ర‌భుత్వం కిడ్నాప్ చేసింద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు త‌న గురించి ఎలాంటి స‌మాచారం లేద‌న్నారు. అయితే దీనికి గ‌ల‌ కార‌ణం కూడా తెలీద‌ని, క‌నీసం త‌న‌‌పై ఎలాంటి కేసు కూడా న‌మోదు కాలేద‌ని తెలిపారు. త‌న‌ స్నేహితురాళ్ల‌ను సైతం కాన్సంట్రేష‌న్ క్యాంపులో నిర్బంధించింద‌ని ఆరోపించారు. చైనాలో అడుగంటిపోతున్న‌ మాన‌వ హ‌క్కుల కోసం తాను గ‌ళ‌మెత్తి ప్ర‌శ్నించినందుకు ప్ర‌తీకారంగా డ్రాగ‌న్ దేశం ఈ అరాచ‌కానికి పూనుకుంద‌న్నారు. త‌న మ‌తానికి చెందిన వారిపై చైనా దుర్మార్గానికి పాల్ప‌డుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. (వెనుదిరిగేందుకు ఇంకొంతకాలం )

అక్క‌డి మ‌హిళ‌లను శారీర‌కంగా‌, మాన‌సికంగా హింసిస్తారు
"1949లో మా భూమిని ఆక్ర‌మించిన‌ప్ప‌టినుంచి క‌మ్యూనిస్ట్ చైనా వివిధ సాకుల‌ను చూపుతూ ఉఘ‌ర్ ముస్లింల‌ను టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు అది తీవ్ర స్థాయికి చేరుకుంది. అక్క‌డి అధికారులు వారిని శారీర‌కంగానూ, మాన‌సికంగానూ చిత్ర‌హింస‌లు పెడుతారు. స‌రైన తిండీ, నీళ్లు ఇవ్వ‌రు. స‌రిగా నిద్ర ‌కూడా పోనివ్వ‌రు. ఈ శిబిరాల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే చాలా మంది మ‌హిళ‌ల‌కు పిల్ల‌లు పుట్ట‌కుండా ఆప‌రేష‌న్లు (స్టెరిలైజేష‌న్‌) చేస్తారు. ఇప్ప‌టికీ అక్క‌డి ర‌హ‌స్య క్యాంపుల్లో 3 మిలియ‌న్ల మంది ఉఘ‌ర్ మ‌హిళ‌లు మ‌గ్గిపోతున్నారు. ఆ దేశ ఎకాన‌మీ కోసం వీరిని క‌ట్టుబానిస‌లుగా వినియోగించుకుంటున్నారు" అ‌ని రుషాన్‌ పేర్కొన్నారు.

బుకాయిస్తోన్న చైనా ప్ర‌భుత్వం
కాగా చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలో ఉఘ‌ర్ ముస్లిములను నిర్బంధించి వారిపై అత్యాచారానికి పాల్ప‌డుతూ బ‌ల‌వంతంగా పెళ్లి చేసుకుని జ‌నాభాను పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఏళ్ల త‌ర‌బ‌డి వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇలా ఎన్నో దారుణాల‌కు అడ్డాగా మారిన కాన్సంట్రేష‌న్ క్యాంపును చైనా తొలిసారిగా 2014లో నిర్మించింది. ఆరేళ్ల‌లో ఇవి విస్త‌రిస్తూ 500 శాతం పెరిగాయి. సాటిలైట్ చిత్రాలు కూడా ఇదే విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నాయి. అయితే ప్ర‌భుత్వం మాత్రం ఈ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ వీటిని 'ఎడ్యుకేష‌న్ క్యాంపులు'గా బుకాయిస్తోంది.  (ఈ మారణహోమానికి చైనాదే బాధ్యత)

మరిన్ని వార్తలు