విమానంలో హెరాయిన్‌.. పాక్‌కు ఎదురుదెబ్బ

17 May, 2017 11:55 IST|Sakshi
విమానంలో హెరాయిన్‌.. పాక్‌కు ఎదురుదెబ్బ

లండన్‌: తమ విమాన సిబ్బందిని అదుపులోకి తీసుకుని అనవసర తనిఖీలు నిర్వహించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్‌కు ఎదురు దెబ్బతగిలింది. పాక్‌ విమానంలో తమకు మత్తుపదార్థాలు దొరికినట్లు బ్రిటన్‌ బోర్డర్‌ ఫోర్స్‌ బాంబు పేల్చింది. లండన్‌కు చెందిన జాతీయ నేర దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించింది. దీంతో వారు విచారణ ప్రారంభించారు. పాకిస్థాన్‌ అంతర్జాతీయ విమానాయన సంస్థ(పీఐఏ)కు చెందిన విమానం ఒక దానిని సోమవారం లండన్‌కు వచ్చిన తర్వాత తెల్లవారు జామున 2.30గంటల ప్రాంతంలో ప్రయాణీకులను దించేసిన అనంతరం 14మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్న అధికారులు అనంతరం విమానంలో తనిఖీలు నిర్వహించారు.

రెండుగంటల తర్వాత విమానాన్ని వదిలిపెట్టారు. అయితే, ఈ విషయంపై పాక్‌ మండిపడింది. ఎలా తమ సిబ్బందిని అదుపులోకి తీసుకుంటారని, లండన్‌ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీకి ఫిర్యాదు కూడా చేస్తామంటూ బీరాలు పోయింది. అయితే, తాజాగా ఆ విమానంలో తాము చేసిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో హెరాయిన్‌ దొరికిందంటూ అధికారులు చెప్పారు. ఆ సందర్భంలో ఎలాంటి హడావుడి చేసినా అది పెద్ద మొత్తంలో గందరగోళం సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో తాము తొలుత పాక్‌ చెప్పలేదని  ఆ తర్వాతే చెప్పామని అన్నారు. అయితే, ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ హెరాయిన్‌ ఎవరు తీసుకొచ్చారనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నామని, ఈ విషయాన్ని పాక్‌కు అధికారికంగా తెలియజేశామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు