టాక్‌ షోలో పాల్గొన్న పార్టిసిపెంట్‌ ఆత్మహత్య

15 May, 2019 18:13 IST|Sakshi

లండన్‌ : పాపులర్‌ బ్రిటీష్‌ టాక్‌ షో ‘ది జెరెమీ కైలే షో’ను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. ఇటీవల ఈ షోలో పాల్గొన్న ఓ పార్టిసిపెంట్‌ ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఐటీవీలో ప్రసారమయ్యే జెరెమీ షోలో ప్రతీ ఎపిసోడ్‌కు ఇద్దరు పార్టిసిపెంట్లను ఆహ్వానిస్తారు. జీవిత భాగస్వాములు, ప్రేమికులే నిర్వాహకుల ప్రధాన టార్గెట్‌. ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఎదుటి వారిపై తమకున్న అభిప్రాయాలు, తమ బంధం గురించి చెప్పాల్సిందిగా కోరతారు. ఈ క్రమంలో స్టీవ్‌ డైమండ్‌(63) అనే వ్యక్తి తన ఫియాన్సితో కలిసి జెరెమీ షోకు హాజరయ్యాడు. ఇందులో భాగంగా నిర్వహించిన లై డిటెక్టర్‌ పరీక్షలో అతడు విఫలమయ్యాడు. దీంతో స్టీవ్‌ తనను మోసం చేశాడని భావించిన ఫియాన్సీ అతడితో తెగదెంపులు చేసుకుంది. ఆమె దూరమవ్వడంతో ఈ కలత చెందిన స్టీవ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే సహా వివిధ వర్గాల నుంచి ఈ షోపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు స్పందించిన ఐటీవీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మాట్లాడుతూ..‘ ఇటీవల చోటుచేసుకున్న విషాదాన్ని దృష్టిలో పెట్టుకుని జెరెమీ షోను నిలిపివేస్తున్నాం. 14 ఏళ్లుగా మిమ్మల్ని అలరించిన షో ఇకపై ప్రసారం కాబోదు. స్టీవ్‌ డైమండ్‌ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ప్రగాభ సానుభూతి తెలుపుతున్నాం’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఇటీవలి కాలంలో టీవీ షోల కారణంగా బ్రిటన్‌లో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పాపులర్‌ షో లవ్‌ ఐలాండ్‌లో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలపై స్పందించిన ప్రధాని అధికార ప్రతినిధి వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు