‘తప్పు చేశాం.. క్షమించండి’

26 Jan, 2019 21:04 IST|Sakshi

లండన్‌ : అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ గురించి అవాస్తవాలు ప్రచురితం చేసినందుకు గానూ యూకేకు చెందిన వార్తాపత్రిక ‘ది టెలిగ్రాఫ్‌’ శనివారం బేషరతుగా క్షమాపణలు చెప్పింది. జనవరి 19న మెలానియా జీవితం గురించి ప్రచురించిన ఆర్టికల్‌లో తప్పులు దొర్లినందుకు తమను క్షమించాలని మెలానియాను కోరింది. ఈ మేరకు ఆమె లీగల్‌ టీమ్‌ కోరిన పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. మెలానియా విజయవంతమైన మోడల్‌ అని, ఎవరి సహాయం లేకుండానే తన కెరీర్‌లో అగ్రపథాన నిలిచారని పేర్కొంది.

కాగా ‘ది మిస్టరీ ఆఫ్‌ మెలానియా’  పేరిట ప్రచురించిన మ్యాగజీన్‌ కవర్‌ పేజీలో.. ‘మోడల్‌గా ఎదిగే క్రమంలో మెలానియా ఎన్నో కష్టనష్టాలను చవిచూశారు. డొనాల్డ్‌ ట్రంప్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కెరీర్‌ ఊపందుకుంది. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగిన రాత్రి మెలానియా భావోద్వేగానికి లోనయ్యారు. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు. తన తల్లిదండ్రులు, సోదరిని 2005లో న్యూయార్క్‌కు తీసుకువచ్చిన మెలానియా..భర్త ట్రంప్‌నకు చెందిన భవనాల్లో వారిని ఉంచారు. ఆమె తండ్రి తన కుటుంబాన్ని చెప్పుచేతల్లో ఉంచలేకపోయారు’ అంటూ ది టెలిగ్రాఫ్‌ అసత్య కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తడంతో మెలానియాను క్షమాపణ కోరుతూ ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వార్తలు