లండన్‌ ఘటన; బ్రిటన్‌ పార్లమెంటులో చర్చ

4 Sep, 2019 17:05 IST|Sakshi

లండన్‌ : బ్రిటన్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయంపై మంగళవారం పాక్‌ మద్దతుదారులు జరిపిన నిరసన ప్రదర్శనల్లో కార్యాలయ పరిసరాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు ఇలా జరగడం గమనార్హం. పాక్‌ మద్దతుదారుల ఆందోళన ఘటనలో కార్యాలయ కిటికీ అద్దాలు పగిలిన దృష్యాలను భారత హైకమిషన్‌ కార్యాలయం మంగళవారం ట్వీట్‌ చేసింది. ఈ ఘటనను లండన్‌ మేయర్‌, పాక్‌ సంతతికి చెందిన వ్యక్తి సాజిద్‌ ఖాన్‌ తీవ్రంగా ఖండించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కూడా. తాజాగా ఈ అంశం బ్రిటన్‌ పార్లమెంటులో చర్చకు వచ్చింది.

మంగళవారం బ్రిటన్‌ పార్లమెంటులో ఈ విషయాన్ని నార్త్‌ వెస్ట్‌ కేంబ్రిడ్జిషైర్‌ ఎంపీ శైలేష్‌ వర లేవనెత్తారు. ఇలాంటి సంఘటనలతో బ్రిటన్‌లో నివసించే భారత సంతతి ప్రజలు కలత చెందుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ విదేశాంగ కార్యదర్శి డొమినిక్‌ రాబ్‌ స్పందిస్తూ ఇలాంటి చర్యలను తమ దేశం సహించబోదంటూ ఘటనను తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశామని, మరి కొంతమందిని కస్టడీలోకి తీసుకున్నామని మెట్రోపాలిటన్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు.        (చదవండి: మళ్లీ పేట్రేగిన పాక్‌ మద్దతుదారులు)

మరిన్ని వార్తలు