నిజాం కేసులో పాక్‌కు మరో దెబ్బ

20 Dec, 2019 02:14 IST|Sakshi

కోర్టు ఖర్చులు చెల్లించాలని పాక్‌కు లండన్‌ కోర్టు ఆదేశం

లండన్‌: లండన్‌లోని నేషనల్‌ వెస్ట్‌ మినిస్టర్‌(నాట్‌వెస్ట్‌) బ్యాంక్‌లో దశాబ్దాలుగా ఉన్న హైదరాబాద్‌ నిజాంలకు చెందిన 3.5 కోట్ల పౌండ్లు నిధులు భారత ప్రభుత్వం, నిజాం వారసులు ముఖ్రంఝా, ముఫఖం ఝాలకే చెందుతాయని అక్టోబర్‌లో హైకోర్ట్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆ నిధులు తమవేనంటూ వాదించిన పాక్‌కు చుక్కెదురైంది. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి న్యాయమూర్తి మార్కస్‌ స్మిత్‌ మరో తీర్పునిచ్చారు. ఇది కూడా పాకిస్తాన్‌ను దెబ్బతీసేదే.

పాకిస్తాన్‌ తమ ప్రతివాదులకు ఈ వివాదానికి సంబంధించి అయిన  న్యాయపరమైన ఖర్చుల మొత్తంలో 65% చెల్లించాలని ఆయన గురువారం తీర్పునిచ్చారు. ‘ఈ వివాదానికి సంబంధించిన ఖర్చుల కింద వారికి ఎంత మొత్తం చెల్లించాలనే విషయంలో ఒక అంగీకారానికి రాని పక్షంలో.. ప్రతివాదులకైన ఖర్చులో 65% పాకిస్తాన్‌ చెల్లించాలి’ అని స్పష్టం చేశారు. 65% పాక్‌ చెల్లిస్తే.. ప్రతివాదులైన భారత ప్రభుత్వానికి సుమారు 28 లక్షల పౌండ్లు, ప్రిన్స్‌ ముఫఖం ఝాకు సుమారు 18 లక్షల పౌండ్లు, ప్రిన్స్‌ ముఖరం ఝాకు సుమారు 8 లక్షల పౌండ్లు లభిస్తాయి.

‘1948 నాటి ఈ వివాదం ఈ నాటికి పూర్తిగా ముగిసింది’ అని నిజాంల తరఫున వాదించిన పాల్‌ హీవిట్‌ వ్యాఖ్యానించారు. జస్టిస్‌ స్మిత్‌ ఇచ్చిన తీర్పును సవాలు చేయాలని పాక్‌ నిర్ణయించుకోలేదని, అందువల్ల ఆ నిధులను తన క్లయింట్లను వినియోగించుకోవచ్చని తెలిపారు. 1948లో ఏడవ నిజాం మిర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 10 లక్షల పౌండ్లను బ్రిటన్‌లోని పాకిస్తాన్‌ హైకమిషనర్‌ హబీబ్‌ ఇబ్రహీంకు పంపించారు. హైదరాబాద్‌లోని తన ఖాతా నుంచి లండన్‌లోని నాట్‌వెస్ట్‌ బ్యాంక్‌లోని హబీబ్‌ ఖాతాకు ఆ మొత్తాన్ని బదిలీ చేశారు. ఆ మొత్తం తమదేనని నిజాం వారసులు, భారత ప్రభుత్వం వాదించగా, ఆయుధాల కొనుగోలు నిమిత్తం వాటిని తమకు బదిలీ చేశారని, ఆ నిధులు తమవేనని పాకిస్తాన్‌ వాదించింది. అనంతరం, నిజాం వారసులు, భారత ప్రభుత్వం ఒక్కటిగా తమ వాదనలు వినిపించాయి.

>
మరిన్ని వార్తలు