త్వరలో భారత్‌కు విజయ్‌ మాల్యా!

5 Feb, 2019 04:25 IST|Sakshi

అప్పగించాలని నిర్ణయం తీసుకున్న బ్రిటన్‌ హోం మంత్రి సాజిద్‌

హైకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు విజయ్‌ మాల్యాకు అవకాశం  

లండన్‌: బ్యాంకుల వద్ద వేల కోట్ల అప్పులు తీసుకుని వాటిని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్‌ మాల్యా త్వరలోనే భారత్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ బ్రిటన్‌ హోం మంత్రి సాజిద్‌ జావీద్‌ ఆదివారమే సంబంధింత పత్రాలపై సంతకం చేశారు. ఈ నిర్ణయంపై హైకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు ఫిబ్రవరి 4 నుంచి 14 రోజులపాటు మాల్యాకు టైముంది. హైకోర్టు మాల్యా అప్పీల్‌ను తిరస్కరిస్తే ఆయన వెంటనే భారత్‌కు తిరిగి రావాల్సి ఉంటుంది.

విచారణకు స్వీకరిస్తే హైకోర్టు తీర్పును బట్టి తదుపరి పరిస్థితులుంటాయి.  మాల్యా భారత్‌లో ఓ కోర్టు కేసును ఎదుర్కోవాల్సి ఉందనీ, ఆయనను భారత్‌కు తిరిగి పంపించాలని తీర్పునిస్తూ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు గతేడాది డిసెంబర్‌ 10న తీర్పు చెప్పింది. ఆ తీర్పు హోం శాఖకు చేరింది. కాగా, పాక్‌ సంతతికి చెందిన మంత్రుల్లో అత్యంత సీనియర్‌ అయిన జావీద్‌.. మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంటూ ఆదివారం సంతకం చేశారు.

కేసులోని అంశాలు, పరిస్థితులను బట్టి చూస్తే హైకోర్టు తీర్పు సైతం మాల్యాకు వ్యతిరేకంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు నష్టాలు రావడం వల్లే తాను అప్పులు తీర్చలేక పోయానని మాల్యా గతంలో లండన్‌ కోర్టులో వాదించగా, అప్పు రూపంలో లభించిన డబ్బును మాల్యా అసలైన అవసరానికి వాడకుండా, పక్కదారి పట్టించాడనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు గతంలో గుర్తించింది. విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్‌ నిర్ణయంపై భారతసర్కారు హర్షం వ్యక్తం చేసింది.

అప్పీల్‌ చేసే పని ప్రారంభిస్తా: మాల్యా
విజయ్‌ మాల్యా ఓ ట్వీట్‌ చేస్తూ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లే పనిని మొదలుపెడతానన్నాడు. ‘వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు డిసెంబర్‌ 10న తీర్పు వచ్చినప్పుడే, అప్పీల్‌కు వెళ్తానని నేను గతంలోనే చెప్పా. హోం మంత్రి దగ్గర ఫైల్‌ పెండింగ్‌లో ఉండటంతో, ఇన్నాళ్లూ అప్పీల్‌ చేయలేకపోయా. ఇప్పుడు ఆ పని మొదలుపెడతా’ అని మాల్యా పేర్కొన్నాడు.

మాట నిలుపుకుంటాం
మాల్యాను భారత్‌కు అప్పగించాలన్న బ్రిటన్‌ నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. మాల్యాను రప్పించడం ద్వారా కొల్లగొట్టిన ప్రజాధనాన్ని రాబట్టి, దోషులను చట్టం ముందు నిలబెడతామంటూ ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చనున్నామని తెలిపింది. ‘బ్యాంకులను మోసగించి పరారైన విజయ్‌ మాల్యా వంటి ఆర్థిక నేరగాళ్లను తిరిగి రప్పించేందుకు భారత ప్రభుత్వ అధికారులు చేసిన నిర్విరామ కృషి ఫలితమిది. ఈ పరిణామం మోదీ ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనం’ అని బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. కుంభకోణాలు, మోసాలకు చట్టబద్ధమైన ముగింపు తెచ్చేలా ప్రభుత్వం దర్యాప్తు సంస్థలకు అవకాశం కల్పించిందని అన్నారు. మోదీ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు తీసుకువచ్చే దిశగా మరో అడుగు ముందుకు వేసిందని మంత్రి జైట్లీ అన్నారు.

మరిన్ని వార్తలు