కశ్మీర్‌ సమస్యకు ఐర్లాండ్‌ తరహా పరిష్కారం

13 Jul, 2018 04:43 IST|Sakshi
ఫరూక్‌ అబ్దుల్లా

లండన్‌: కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి బ్రిటన్‌–ఐర్లాండ్‌లు అనుసరిస్తున్న కామన్‌ ట్రావెల్‌ ఏరియా విధానాన్ని అమలుచేయాలని కశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా సూచించారు. కశ్మీర్‌ సమస్యకు సైనిక చర్య పరిష్కారం కాదని భారత్, పాకిస్తాన్‌లు అర్థం చేసుకోవాలన్నారు. సౌత్‌ ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ లండన్‌లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఫరూక్‌ మాట్లాడారు. ‘సమస్య పరిష్కారానికి తీసుకునే ఏ నిర్ణయాన్నైనా ప్రతిఒక్కరూ ఆమోదించబోరని అణ్వస్త్ర దేశాలైన భారత్, పాక్‌లు అర్థం చేసుకుంటే కశ్మీర్‌ సమస్య పరిష్కారం కావొచ్చు. కానీ భారత్, పాకిస్తాన్‌ కశ్మీర్‌లో కనీసం 80 శాతం మంది ఆ నిర్ణయాన్ని అంగీకరించి తీరాలి’ అని చెప్పారు. యూకేలో భాగమైన ఉత్తర ఐర్లాండ్, రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌ల మధ్య 1920ల్లో కామన్‌ ట్రావెల్‌ ఏరియా విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో బ్రిటన్, రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌ పౌరులు పాస్‌పోర్ట్‌ లేకుండా రెండో దేశంలో స్వేచ్ఛగా పర్యటించవచ్చు.  

మరిన్ని వార్తలు