కరోనా: గుడ్‌న్యూస్‌ చెప్పిన జర్నలిస్టు

30 Mar, 2020 14:36 IST|Sakshi

లండన్‌: ‘‘దాదాపు 2 వారాలు ఇంట్లోనే ఉన్నాను. కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకున్నాను. నిన్ననే మెట్లు దిగి కిందకు వెళ్లాను. గార్డెన్‌ చూసుకున్నాను. దీర్ఘమైన శ్వాస తీసుకున్నాను. ఇదొక గుడ్‌న్యూస్‌ అవుతుందనుకుంటున్నా. అందుకే మీతో పంచుకుంటున్నా’’అంటూ యూకే జర్నలిస్టు తోబి అకింగ్‌బాడే తాను కరోనా వైరస్‌ నుంచి విముక్తి పొందినట్లు సోషల్‌ మీడియాలో వెల్లడించారు. కోవిడ్‌-19 సోకిన వ్యక్తిని నేరుగా కలిసినందు వల్లే తనకు మహమ్మారి సో​కిందని... 12 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండటం కష్టంగా తోచినా.. తర్వాత అంతా బాగానే గడిచిందన్నారు. కరోనా లక్షణాలు, ప్రాణాంతక వైరస్‌ కారణంగా ఎదుర్కొన్న బాధలు, వాటిని అధిగమించిన తీరును ట్విటర్‌లో పంచుకున్నారు.(వైరస్ ప్లాస్టిక్‌పైన 72 గంటలు బతుకుతుంది)

‘‘కరోనా రెండో రోజు: విపరీతమైన పొడిదగ్గు. రాత్రంతా దగ్గుతూనే ఉన్నాను. ఛాతిలో నొప్పి వచ్చేది. తర్వాత జ్వరం వచ్చింది. నడవలేకపోయేదాన్ని. ఆహారం తీసుకోవడానికి కూడా శక్తి లేకుండా పోయింది. కండరాలు పట్టేశాయి. ఇలా రెండు రోజులు గడిచాక.. పొద్దున లేవగానే శరీరం మీద నుంచి ట్రక్కు వెళ్లినట్లు, కొండ అంచు నుంచి ఎవరో నన్ను తోసేసినట్లు.. గిరగిరా తిరిగినట్లు అనిపించేది. ఆ తర్వాత మైగ్రేన్‌ వచ్చింది. ఐదో రోజు నుంచి మందుల సాయంతో నొప్పిని దిగమింగి బాగా నిద్రపోవడం అలవాటు చేసుకున్నా. ఫోన్‌ స్క్రీన్‌ చూసేందుకు సన్‌గ్లాసెస్‌ వాడేదాన్ని. (కరోనాతో ప్రముఖ సింగర్‌ మృతి)

ఇక ఎండలోకి వెళ్తే తలనొప్పి ఇంకా ఎక్కువయ్యేది. ఊపిరితిత్తులు పనిచేయడం మానేశాయా అనిపించింది. శ్వాస ఆడేదికాదు. ఆ తర్వాత పెయిన్‌కిల్లర్‌లతో కాలం వెళ్లదీశాను. దేవుడా ఇంత ఘోరమైన చావు ఎందుకు ఇస్తున్నావు దేవుడా అని ప్రార్థన చేసేదాన్ని. క్రమక్రమంగా కరోనా లక్షణాలు మాయమైపోయాయి. ఎనిమిదో రోజు నుంచి వర్క్‌ ఫ్రం హోం మొదలుపెట్టాను. వైద్యుల సూచనల ప్రకారం నడుచుకున్నాను. పన్నెండో రోజుకి ఆరోగ్యవంతురాలిగా మారాను. అయితే ఇప్పుడే అంతా అయిపోలేదు. ఇక ముందు కూడా జాగ్రత్తగా ఉండాలి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మారి బారి నుంచి బయటపడొచ్చు. నాకు 28 ఏళ్లు. ఇంట్లోనే ఉంటూ బాధ్యతగా వ్యవహరించాను. నేను కోలుకున్నాను’’ అని తోబి ట్విటర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు