గందరగోళంలో బ్రెగ్జిట్‌

2 Sep, 2019 03:51 IST|Sakshi

బ్రెగ్జిట్‌ పీటముడి మరింత జటిలమైపోయింది. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం బ్రిటన్‌ అక్టోబర్‌   31కల్లా యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలగాల్సి ఉండగా.. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కాస్తా పార్లమెంటును సస్పెండ్‌ చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఒప్పందంలో మార్పులు జరిగితే బ్రిటన్‌ వైదొలగేందుకు తనకు అభ్యంతరం లేదని బోరిస్‌ అంటూండగా.. విపక్షాలు తమకు అనుకూలమైన మార్పులు జరిగితేనే వీడాలని పట్టుపడుతున్నాయి. లేదంటే బ్రిటన్‌కు ఆర్థికంగా నష్టమని హెచ్చరిస్తున్నాయి. ఇంతకీ అక్టోబర్‌ 31లోగా బ్రెగ్జిట్‌ సాధ్యమేనా? అధికార, విపక్షల ముందున్న అవకాశాలు ఏంటి?

రహస్య పద్ధతితో సాధిస్తారా?
మెరుగైన ఒప్పందం లేకుండా విడిపోవడంపై పార్లమెంటు సభ్యులు అత్యధికుల్లో అభ్యంతరాలున్నాయి. కానీ ఇది జరక్కుండా ఉండాలంటే పార్లమెంటు పనిచేయాల్సి ఉంటుంది. పార్లమెంటు సస్పెన్షన్‌లో ఉన్న నేపథ్యంలో పరిస్థితులు జటిలంగా మారినా.. ప్రతిపక్ష నేతలు జో స్విన్‌సన్‌ లాంటి వాళ్లు తమ గళాన్ని పెంచారు. ఇటీవలి బీబీసీ ఇంటర్వ్యూలో లిబరల్‌ డెమొక్రాట్స్‌ నేత అయిన జో స్విన్‌సన్‌ మాట్లాడుతూ తామూ బోరిస్‌ జాన్సన్‌ మాదిరిగా ఒక సీక్రెట్‌ పద్ధతి ద్వారా తమకు కావాల్సింది సాధించుకుంటామని సూచించారు. అదేంటో ఇప్పటికి స్పష్టం కాకపోయినా... అనూహ్య పరిణామమేదైనా జరగవచ్చునని మాత్రం తెలుస్తోంది.

తుది అస్త్రంగా అవిశ్వాసం...
మెరుగైన బ్రెగ్జిట్‌ ఒప్పందంపై చట్టం చేయలేని పరిస్థితి ఏర్పడితే బోరిస్‌ జాన్సన్‌ను ప్రధాని పదవి నుంచి తప్పించేందుకు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముంది. ప్రస్తుతానికి ఇందుకు తగ్గ బలం లేకపోగా.. దీనివల్ల సమస్య పరిష్కారమవుతుందన్న నమ్మకమూ లేదు. అవిశ్వాస తీర్మానం మేరకు ఒకవేళ బోరిస్‌ జాన్సన్‌ దిగిపోయినా రెండు వారాల్లోగా కొత్త ప్రభుత్వం ఏర్పడటం, లేదంటే సాధారణ ఎన్నికలు నిర్వహించడం జరగాలని బ్రిటన్‌ చట్టాలు చెబుతూండటం దీనికి కారణం. ఆపద్ధర్మ ప్రధాని నియామకం ద్వారా బ్రెగ్జిట్‌ను వాయిదా వేసి ఎన్నికలు నిర్వహించవచ్చు.

కానీ.. ఆపద్ధర్మ ప్రధాని ఎవరన్న అంశంపై ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. లేబర్‌ పార్టీ తరఫున జెరెమీ కార్బిన్‌... ఆపద్ధర్మ ప్రధాని అభ్యర్థి కావచ్చుగానీ... యూనియన్‌ వ్యతిరేకిగా ముద్ర ఉన్న కారణంగా అతడిని బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తున్న వారు ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ అన్నీ సవ్యంగా జరిగి ఆపద్ధర్మ ప్రధాని బాధ్యతలు చేపడతాడు అనుకుంటే.. బోరిస్‌ మరో ఎత్తు వేయవచ్చు. రాజీనామా చేయకుండా నవంబర్‌లోనే ఎన్నికలు నిర్వహించవచ్చు. దీంతో మెరుగైన ఒప్పందం లేకుండానే అక్టోబర్‌ 31 తరువాత బ్రెగ్జిట్‌ అమల్లోకి వచ్చేస్తుంది.  

ఒప్పందంతో బయటకు...
థెరెసా మే ప్రధానిగా ఉండగా సిద్ధమైన ఒప్పందాన్ని బ్రిటన్‌ పార్లమెంటు ఇప్పటికే మూడుసార్లు తిరస్కరించిన నేపథ్యంలో ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువే. మరోవైపు యూరోపియన్‌ యూనియన్‌ కూడా మరోసారి చర్చలు లేవని భీష్మించుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 17 –18లలో జరిగే యూనియన్‌ నేతల సమావేశం కీలకం కానుంది. ప్రధాని బోరిస్‌ ఏదో ఒక రకంగా యూనియన్‌ నేతలను ఒప్పించి ఒప్పందంలో మార్పులు తీసుకు వస్తే.. ఆ మార్పులను బ్రిటన్‌ పార్లమెంటు ఆమోదిస్తేనే బ్రిటన్‌కు నష్టదాయకం కాని ఒప్పందంతో బ్రెగ్జిట్‌ అమల్లోకి వస్తుంది.  

ఒప్పందం లేకుండానే వీడుతుందా..?
మెరుగైన ఒప్పందం కుదుర్చుకునేందుకు బోరిస్‌ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోతే ఒప్పందం లేకుండానే యూనియన్‌ను వీడేందుకు ఆయన సిద్ధం కావచ్చు. కాలపరిమితి కారణంగా పార్లమెంటు కూడా దీన్ని అడ్డుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒప్పందంలో మార్పులు జరిగినా, జరక్కపోయినా అక్టోబర్‌ 31 తరువాత బ్రిటన్‌ యూరోపియన్‌ యూనియన్‌లో భాగం కాదు కాబట్టి.  
ఇదే జరిగితే జాన్సన్‌ బ్రెగ్జిట్‌ మద్దతుదార్లను కూడగట్టుకుని ఈ ఏడాది చివర లేదంటే వచ్చే ఏడాది మొదట్లో సాధారణ ఎన్నికలకు సిద్ధం కావచ్చు. కానీ యూనియన్‌ నుంచి వైదొలగిన తరువాతి ఆర్థిక పరిణామాల కారణంగా ఆ ఎన్నికలను గెలవడం బోరిస్‌కు కష్టం కావచ్చు.  

ముందస్తు ఎన్నికలు..?
పార్లమెంటు సస్పెన్షన్‌ మొదలయ్యేలోపు ఎంపీలు అందరూ మెరుగైన ఒప్పందం లేకుండా బ్రెగ్జిట్‌ కుదరదని చట్టం చేయగలిగితే.. ఆ వెంటనే బోరిస్‌ జాన్సన్‌ సాధారణ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావచ్చు. ప్రస్తుతం ఒకే ఒక్క సభ్యుడి ఆధిక్యంతో సభ నడుస్తూండగా.. ఎన్నికలు జరిగితే జాన్సన్‌కు మద్దతు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే అవి అక్టోబర్‌ 17 లోగానే జరగవచ్చునని తద్వారా బోరిస్‌ గెలిస్తే.. యూరోపియన్‌ యూనియన్‌ సదస్సుకు వెళ్లి తన బలాన్ని ప్రదర్శించవచ్చునని అంచనా. కానీ.. ఎన్నికలు నిర్వహించాలంటే హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో మూడింట రెండు వంతుల మంది మద్దతు కావాల్సి ఉంటుంది. అంటే.. బోరిస్‌కు ప్రతిపక్ష నేతల సభ్యులు కొందరు మద్దతు పలకాలి. లేబర్‌ పార్టీ కూడా తక్షణ ఎన్నికలు కోరుకుంటున్నా బోరిస్‌పై ఉన్న అపనమ్మకం కారణంగా అతడికి మద్దతిచ్చే అవకాశాలు తక్కువే.

న్యాయస్థానాలు నిర్ణయిస్తాయా?
పార్లమెంటును సస్పెండ్‌ చేయడంపై ఇప్పటికే బ్రిటన్‌ న్యాయస్థానాల్లో మూడు కేసులు నమోదయ్యాయి. గతంలో పార్లమెంటును కాదని యూనియన్‌తో చర్చలకు సిద్ధమైన థెరెసా మే నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేసి గెలుపొందిన గినా మిల్లర్‌ ఇప్పుడు కూడా బోరిస్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తున్నారు. దీంతో బ్రెగ్జిట్‌ బంతి బ్రిటన్‌ కోర్టులో పడిపోతుంది!

మరిన్ని వార్తలు