ముందస్తుకు బ్రిటన్‌ జై

31 Oct, 2019 04:21 IST|Sakshi

పార్లమెంటు ఆమోద ముద్ర

డిసెంబర్‌ 12న ఎన్నికలు

లండన్‌: బ్రెగ్జిట్‌ సంక్షోభాన్ని నివారించడానికి బ్రిటన్‌ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది. బ్రిటిష్‌ పార్లమెంటుకి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధానమంత్రి బొరిస్‌ జాన్సన్‌ ఇచ్చిన పిలుపుకి ప్రజాప్రతినిధులందరూ అనుకూలంగా స్పందించారు. దీంతో డిసెంబర్‌ 12న ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి బ్రిటన్‌ వైదొలగడానికి జనవరి నెలఖారువరకు ఈయూ గడువు పొడిగించడంతో ఈలోగా ఎన్నికలు నిర్వహించాలని బొరిస్‌ జాన్సన్‌ భావించారు. బ్రిటన్‌లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటే ప్రధానమంత్రి ఎంపీల మద్దతుతో మాత్రమే ఆ పని చేయగలరు.

ఎన్నికలకు పార్లమెంటు ఆమోదం  
ప్రధాని బొరిస్‌ జాన్సన్‌ ముందస్తు ఎన్నికల ప్రతిపాదనపై చర్చించిన హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ 438–20 తేడాతో ఆమోద ముద్ర వేసింది. బ్రెగ్జిట్‌ ప్రణాళికకు అనుకూలంగా ప్రజా మద్దతు కూడగట్టుకోవడానికి జాన్సన్‌ క్రిస్‌మస్‌ పండుగకి ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని వ్యూహరచన చేశారు. ఓటు హక్కు వయసుని 16కి తగ్గించాలని, ఓటింగ్‌లో ఈయూ పౌరులు కూడా పాల్గొనాలని, డిసెంబర్‌ 9న ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష లేబర్‌ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.  

ఇరు పార్టీలకూ ప్రతిష్టాత్మకమే  
మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న కన్జర్వేటివ్‌ పార్టీ ఎలాగైనా బ్రెగ్జిట్‌ ఒప్పందానికి ఆమోద ముద్ర పడేలా ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతోంది. కానీ బ్రెగ్జిట్‌ ఒప్పందాన్ని విపక్ష లేబర్‌ పార్టీ వ్యతిరేకిస్తూ ఉండడంతో అది సాధ్యం కావడం లేదు. బ్రెగ్జిట్‌కు ఈయూ గడువును అక్టోబర్‌ 31 నుంచి 2020 జనవరి 31 వరకు పెంచిన వెంటనే ప్రధాని బొరిస్‌ జాన్సన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ప్రతిపక్ష లేబర్‌ పార్టీ కూడా సహకరించింది.

పార్లమెంటులో మరింత బలం పెంచుకొని ఈయూకి గుడ్‌బై కొట్టేయాలని లెక్కలు వేసుకుంటున్న బొరిస్‌ దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఈ ఎన్నికలు అత్యంత కీలకమని ప్రజలందరూ గ్రహించాలన్నారు. బ్రిటన్‌ బ్రెగ్జిట్‌ కల సాకారమవడానికి ప్రజలందరూ చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. వామపక్షభావజాలం కలిగిన లేబర్‌ పార్టీ నాయకుడు జెర్మీ కార్బన్‌ కూడా మార్పు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఒపీనియన్‌ పోల్స్‌ అన్నీ కన్జర్వేటివ్‌ పార్టీకే అధికారం దక్కుతుందని అంచనా వేస్తూ ఉండడంతో కార్బన్‌ నేతృత్వంలో ఎలాంటి ఫలితాలు వస్తాయోనన్న ఆందోళన ఆ పార్టీ ఎంపీల్లో నెలకొని ఉంది.

నాలుగేళ్లలో మూడో ఎన్నికలు
బ్రిటన్‌లో గత నాలుగేళ్లలో మూడోసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రజా తీర్పులో చాలా వైరుధ్యాలు ఉన్నాయి. 2015, 2017 ఎన్నికల్లో ప్రజల మూడ్‌లో వచ్చిన మార్పు చూస్తే ఈ ఎన్నికల్లో జాన్సన్‌ చావో రేవో తేల్చుకోవాల్సిందేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. బ్రెగ్జిట్‌ ఒప్పందం ముందుకు వెళ్లాలంటే బొరిస్‌ జాన్సన్‌ కచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలి. హంగ్‌ పార్లమెంటు వస్తే మళ్లీ దేశంలో అనిశ్చితి తప్పదని నిపుణుల అభిప్రాయంగా ఉంది.  

మరిన్ని వార్తలు