ఫ్లవర్ వాజ్ అనుకొని ఫిరంగిలో పూలుపెట్టి..

5 Oct, 2015 06:54 IST|Sakshi
ఫ్లవర్ వాజ్ అనుకొని ఫిరంగిలో పూలుపెట్టి..

లండన్: అది మొదటి ప్రపంచయుద్ధంనాటి పేలని ఫిరంగి గుండు. దాని గురించి తెలియని ఓ బ్రిటన్ మహిళ తనకు పదిహేనేళ్లు ఉన్నప్పటి నుంచి దానిని ఫ్లవర్ వాజ్గా ఉపయోగించింది. ప్రస్తుతం ఆమెకు 45 ఏళ్లు. అంటే దాదాపుగా 30 ఏళ్లుగా దానిని అలాగే వాడుతోంది. ఇటీవల అది ఫిరంగి తెలియడంతో అవాక్కయి అదిరిపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటన్లోని కావెంట్రీ అనే ప్రాంతలో కేథరిన్ రాలిన్ అనే మహిళ ఉంటోంది. ఆమెకు 15 ఏళ్లు ఉన్న సమయంలో ఓ పాఠశాలకు సమీపంలో ఆడుకుంటుండగా ఓ ఫిరంగి గుండు దొరికింది. అయితే, దానిని ఇంటికి తీసుకెళ్లిన కేథరిన్ దానిని ఒక ఫ్లవర్ వాజ్గా భావించి అందులో తనకు ఇష్టమైన ప్లాస్టిక్ పూలను పెట్టి అలంకరించుకుంటోంది. అది లైవ్ బాంబ్ అని ఆమెకు తెలియదు కూడా.

ఈ ఫిరంగి గుండుని మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ సేనలు జారవిడిచాయి. కానీ అప్పట్లో అది పేలలేదు. ఇయితే ఇటీవల ఆమె ఓ డాక్యుమెంటరీని వీక్షించింది. అందులో నాడు జర్మనీ సేనలు కావెంట్రీ ప్రాంతంలో ఓ బాంబును జారవిడిచాయని, కానీ అది పేలలేదని దాని ఛాయా చిత్రాలు కూడా చూపించింది. దీంతో తొలుత అదిరిపడింది. అది పేలితే ఓ ఇళ్లును నేలమట్టం చేయడంతోపాటు 20 మీటర్ల ప్రాంతాన్ని ధ్వంసం చేస్తుందని కూడా పోలీసులు ఆ డాక్యుమెంటరీలో చెప్పారు. దీంతో ఆమెకు గుండెలు జారినంతపనైంది. దీంతో పోలీసులు వచ్చి దానిని తీసుకెళ్లి చివరకు అందులోని పేలుడు పదార్థాన్ని తొలగించి తిరిగి ఆమెకే ఆ వస్తువును అప్పగించడంతో మళ్లీ ఫ్లవర్ వాజ్గా వాడుకుంటోంది. ప్రస్తుతం ఇద్దరు బిడ్డల తల్లి అయిన కేథరిన్ స్కూల్ టీచర్గా పనిచేస్తోంది.

మరిన్ని వార్తలు