క్షిపణి వల్లే కూలింది..

11 Jan, 2020 03:37 IST|Sakshi
టార్‌ క్షిపణి వ్యవస్థ

ఉక్రెయిన్‌ విమాన ఘటనలో ఇరాన్‌పై కెనడా, బ్రిటన్, అమెరికా ఆరోపణ

తోసిపుచ్చిన ఇరాన్‌

ప్రమాదానికి క్షిపణి దాడి కారణం కాదని స్పష్టీకరణ

టెహ్రాన్‌/ఒట్టావా/వాషింగ్టన్‌: ఇరాన్‌లో కుప్పకూలిన ఉక్రెయిన్‌ విమాన ఘటనపై వివాదం తీవ్రమవుతోంది. ఆ విమానం ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణి దాడిలోనే అనేందుకు ఆధారాలున్నాయని కెనడా, బ్రిటన్‌ తదితర దేశాలు పేర్కొన్నాయి. అయితే, పొరపాటున అది జరిగి ఉండొచ్చని వ్యాఖ్యానించాయి. క్షిపణి దాడిలోనే ఆ బోయింగ్‌ 737 విమానం కూలిపోయిందనేందుకు బలం చేకూర్చే వీడియో ఆధారమొకటి తెరపైకి వచ్చింది. ఆ వీడియోలో ఆకాశంలో వేగంగా వెళ్తున్న వస్తువు ఒకటి కనిపిస్తుంది.

కాసేపటికి ఒక మెరుపులాంటి దృశ్యం, ఆ తరువాత పేలుడు శబ్దం వినిపిస్తుంది. ఆ వీడియోను తాము వెరిఫై చేశామని ది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. పలు నిఘా వర్గాల సమాచారం ప్రకారం గతంలో రష్యా నుంచి ఇరాన్‌ కొన్న ఎస్‌ఏ–15 టార్‌ క్షిపణి వ్యవస్థ నుంచి ప్రయోగించిన క్షిపణి వల్లే విమానం కూలినట్లు స్పష్టమవుతోందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో శుక్రవారం పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని, వాస్తవాలు తమ పౌరులకు తెలియాల్సి ఉందని అన్నారు. విమాన ప్రమాదంలో చనిపోయిన 176 మందిలో 63 మంది ప్రయాణీకులు కెనడా పౌరులే. మిగతావారిలో 82 మంది ఇరాన్, 11 మంది ఉక్రెయిన్, 10 మంది స్వీడన్, నలుగురు ఆఫ్గానిస్తాన్, ముగ్గురు జర్మన్, ముగ్గురు బ్రిటన్‌ పౌరులున్నారు.

తమ క్షిపణి దాడిలోనే విమానం కూలిందన్న ఆరోపణలను ఇరాన్‌ ఖండించింది. సంబంధిత ఆధారాలివ్వాలని అమెరికా, కెనడాలను కోరింది. ప్రమాద ఘటనపై జరుగుతున్న విచారణలో పాలుపంచుకోవాలని బాధిత దేశాలతో పాటు బోయింగ్‌ సంస్థను కోరింది. విమాన ప్రమాదానికి క్షిపణి దాడే కారణమని వివిధ ఆధారాల ద్వారా స్పష్టమవుతోందని బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ అన్నారు. తమకందిన సమాచారం ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణుల వల్లనే విమానం కూలిందని స్పష్టం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు.  ప్రమాదంపై సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని ఈ నేతలు డిమాండ్‌ చేశారు.   ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేసిన రోజే ఈ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.   

దళాల ఉపసంహరణ ప్రారంభించండి
బాగ్దాద్‌: ఇరాక్‌ నుంచి బలగాలను ఉపసంహరించేందుకు సాధ్యమైనంత త్వరగా కార్యాచరణ రూపొందించుకోవాలని అమెరికాకు ఇరాక్‌ సూచించింది. ఇరాక్‌ ప్రధాని అదెల్‌ అబ్దుల్‌ మెహదీకి గురువారం రాత్రి యూఎస్‌ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియొ ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా, తమ దేశం నుంచి అమెరికా దళాల ఉపసంహరణను ప్రారంభించాలని పాంపియోను కోరారు.  
 

మరిన్ని వార్తలు