పొరపాటున కూల్చేశాం

12 Jan, 2020 04:53 IST|Sakshi

విమాన ప్రమాదంపై ఇరాన్‌ ఎట్టకేలకు ఒప్పుకోలు

టెహ్రాన్‌/వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌ విమానాన్ని తాము పొరపాటున కూల్చేశామని ఇరాన్‌ ఎట్టకేలకు శనివారం అంగీకరించింది. మానవ తప్పిదం కారణంగా పేలిన క్షిపణులు బోయింగ్‌ 737ను ఢీకొన్నాయని, ఫలితంగా అది కుప్పకూలిపోయి 176 మంది మరణాలకు కారణమైందని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ ప్రకటించారు.  తాము జరిపిన సైనిక విచారణలో తప్పిదం విషయం తెలిసిందని చెప్పారు. అయితే ఈ ప్రమాదానికి తమకు సంబంధం లేదని ఇరాన్‌ ఇన్నిరోజులూ చెప్పింది. ఇరాన్‌ సైనిక జనరల్‌ ఖాసీం సులేమానీని అమెరికా డ్రోన్‌ దాడిలో చంపేయడం, ఇందుకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులతో వరుస దాడులు జరపడం.. ఆ వెంటనే కొంత సమయానికే ఈ ఘటన చోటు చేసుకోవడంతో దీనిపై సర్వత్రా చర్చ మొదలైంది.

శత్రువని అనుకున్నాం...
శత్రువులకు సంబంధించిన విమానం అనుకోవడం వల్లనే పొరబాటున ఉక్రెయిన్‌ విమానాన్ని క్షిపణులతో కూల్చేయాల్సి వచ్చిందని ఇరాన్‌ మిలటరీ వర్గాలు అంగీకరించాయి. మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ వెల్లడించారు. ఈ తప్పుకు కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మృతుల్లో అధికులు ఇరాన్‌– కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారు కాగా, ఉక్రెయిన్‌ దేశస్తులు కొందరు ఉన్నారు. కెనడా ప్రధాని ట్రూడో స్పందిస్తూ.. బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్‌ చేయగా.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బాధ్యులను శిక్షించాలని, మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు.

అతన్నీ చంపాలనుకుంది
ఇరాన్‌ సైనిక జనరల్‌ సులేమానీని చంపిన రోజే మరో ఇరాన్‌ కమాండర్‌ను కూడా అమెరికా చంపాలనుకుందని, అయితే ఆ వ్యూహం విఫలమైందని అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రిపబ్లికన్‌ గార్డ్‌ కోర్‌ కమాండర్‌ అబ్దుల్‌ రెజా షహ్లైని అమెరికా తుదముట్టించాలనుకుంది. ఈ గ్రూపును కూడా అమెరికా ఇప్పటికే ఉగ్రవాద జాబితాలో చేర్చింది. ఇద్దరు నాయకుల మరణాలు ఒకేరోజు జరిగితే ఇరాన్‌ బలగాలు నీరుగారిపోతాయని అమెరికా భావించింది. అందుకే అబ్దుల్‌ రెజాను కూడా చంపేందుకు అమెరికా అధ్యక్షుడు అనుమతి ఇచ్చారు.

అయితే యెమెన్‌లో ఉన్న ఆయన అమెరికా నుంచి తప్పించుకోగలిగారు. షియా మిలిటెంట్‌ గ్రూపులకు అబ్దుల్‌ రెజా ఆయుధాలు, నిధులు సమకూర్చుతున్నట్లు అమెరికా ప్రకటించింది. అతడు చేస్తున్న వ్యవహారాల గురించి చెప్పిన వారికి భారీ మొత్తం ఇస్తామని కూడా ప్రకటించింది. అమెరికాకు వ్యతిరేకంగా, ఉగ్రవాదులకు స్వర్గధామమైన యెమెన్‌లో అబ్దుల్‌ రెజాను చంపేందుకు తమ దేశం వేసిన ప్రణాళికను తాము చూశామని, అయితే అది విఫలమైనందున మరిన్ని విషయాలు చెప్పడంలేదని పెంటగాన్‌ అధికార ప్రతినిధి, నేవీ కేడర్‌కు చెందిన రెబెకా రెబరిచ్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు