కూలిన విమానం

9 Jan, 2020 03:55 IST|Sakshi
ఘటనా స్థలిలో చెల్లా చెదురుగా పడిన విమాన శకలాలు. కీవ్‌లో రోదిస్తున్న ఓ మహిళ(ఇన్‌సెట్లో )

ఇరాన్‌లో 176 మంది దుర్మరణం

టెహ్రాన్‌: అగ్రరాజ్యం అమెరికాతో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఇరాన్‌లో ఓ విమానం కుప్పకూలింది. ఉక్రెయిన్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన పౌర విమానం టెహ్రాన్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయిన రెండు నిమిషాలకే కూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 176 మంది మృతి చెందారు. బోయింగ్‌ 737 విమానం టెహ్రాన్‌ నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. విమాన ప్రమాదంలో మృతి చెందినవారిలో ఇరాన్, కెనడా దేశస్తులే అత్యధికంగా ఉన్నారు. ఇరాన్‌కి చెందినవారు 82 మంది, కెనడా దేశస్తులు 63 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో 15 మంది చిన్నారులు కూడా ఉన్నారు.  
రెండు నిమిషాల్లోనే రాడార్‌ నుంచి అదృశ్యం
ఉక్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌కు (యూఐఏ) చెందిన పీఎస్‌ 752 విమానం టెహ్రాన్‌ విమానాశ్రయంనుంచి ఉదయం 6:10 గంటలకి టేకాఫ్‌ అయింది. ఆ తర్వాత రెండు నిమిషాలకే రాడార్‌తో సంకేతాలు తెగిపోయాయి. టెహ్రాన్‌ విమానాశ్రయానికి వాయవ్య దిశగా 45 కి.మీ. దూరంలో షారియార్‌లోని పంట పొలాల్లో విమాన శిథిలాలు కనిపించినట్టు ఇరాన్‌ మీడియా వెల్లడించింది. విమానంలో ప్రయాణిస్తున్న 176 మందిలో ఎవరూ జీవించే అవకాశమే లేదు. ఇరాన్‌ మీడియా ప్రసారం చేసిన వీడియోలో విమానం కూలిన ప్రాంతంలో మంటలు, దట్టమైన పొగ అలము కొని ఉన్నాయి. సహాయ సిబ్బంది మృతదేహాలను, ప్రయాణికుల వస్తువులను మోసుకొస్తున్న దృశ్యాలు అందరి హృదయాల్ని కలిచివేశాయి.  

కూలిపోయిందా ? కూల్చేశారా ?  
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ విమానాన్ని కూల్చివేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇరాన్‌ దేశానికి చెందిన క్షిపణి పొరపాటున విమానాన్ని కూల్చేసిందని సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం మొదలైంది. విమానం ప్రమాదవశాత్తూ కూలిపోకుండా, వేరే ఏదైనా కుట్ర కోణం ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాడిమిర్‌ జెలెంస్కీ హెచ్చరించారు.

సందేహాలు  
► ఇరాక్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులతో దాడి చేసిన కొద్ది సేపటికే విమానం ప్రమాదానికి గురైంది. ఇరాన్‌ క్షిపణులకి పొరపాటున తగలడం వల్లే విమానం ప్రమాదానికి గురైందన్న అనుమానాలున్నాయి.  

►  బోయింగ్‌ 737 విమానం 2016లో తయారు చేశారు. ప్రమాదానికి గురైన రెండు రోజుల ముందే దానిని  తనిఖీ చేశారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు చెందిన ఈ ఎయిర్‌లైన్స్‌ విమానం ప్రమాదానికి గురికావడం ఇదే మొదటి సారి. విమానం పూర్తిగా పనిచేసే సామర్థ్యంలోనే ఉందని యూఐఏ అధ్యక్షుడు యెవగనీ వెల్లడించారు. తాము నడిపే విమానాల్లో ఇదే అత్యుత్తమమైనదనీ కన్నీళ్ల మధ్య చెప్పారు.

► విమానం కుప్పకూలాక మంటల్లో చిక్కుకుం దని ఇరాన్‌ మీడియా వెల్లడించింది. కానీ గాల్లోనే విమానం మంటల్లో చిక్కుకున్నట్టుగా ప్రమాద దృశ్యాల్లో కనిపిస్తోంది.

►  విమానంలో టిక్కెట్‌ బుక్‌ చేసుకొని ఆఖరి నిముషంలో ఇద్దరు ప్రయాణికులు రద్దు చేసుకున్నారని ఉక్రెయిన్‌ జాతీయ భద్రతా మండలి చీఫ్‌ ఒలెక్సీ డేనిలవ్‌ అంటున్నారు.  

► ప్రమాద స్థలిలో దొరికిన బ్లాక్‌ బాక్స్‌లను తయారీ కంపెనీ బోయింగ్‌ సంస్థకు కానీ, అమెరికాకి కానీ ఇరాన్‌ ఇంకా ఇవ్వలేదు. విమాన ప్రమాదంపై విచారణ ఏ దేశం చేస్తుందో స్పష్టత లేదని అందుకే ఇవ్వలేదని
ఇరాన్‌ అధికారులు చెబుతున్నారు.  

► ఈ విమాన ప్రమాదంలో మానవ తప్పిదం ఉన్నట్టుగా తాము భావించడం లేదని బోయింగ్‌ సంస్థ చెబుతోంది.  
అంతకు ముందు ఇరాన్‌లో ఉక్రెయిన్‌ దౌత్యకార్యాలయం తన వెబ్‌సైట్‌లో ఈ ప్రమాదం వెనుక ఎవరి హస్తం లేదని, ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే ఇంజిన్‌ వ్యవస్థ పనిచేయకపోవడమే కారణమని భావిస్తున్నట్టు వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు