భారత్‌-చైనా వివాదం : యూఎన్‌ఓ జోక్యం

28 May, 2020 14:50 IST|Sakshi

న్యూయార్క్‌ : భారత్‌-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ) స్పందించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వివాదాన్ని సద్దుమణిగించేలా ఇరు దేశాలు వ్యవహరించాలని, సరిహద్దుల వెంట ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడాలని యూఎన్‌ఓ సూచించింది. ఒకవేళ దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోని పక్షంలో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను సరిచేసుకోవాలని వ్యాఖ్యానించింది. అలాగే భారత్‌-చైనా మధ్య తాను మధ్యవర్తిత్వం వహిస్తా అంటూ ముందుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదనను కూడా ఇరు దేశాలు పరిశీలించాలని కోరింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఓ ప్రకటన చేశారు. (మధ్యవర్తిత్వం చేస్తా)

కాగా లదాఖ్, సిక్కిం ప్రాంతాల్లో భారత్‌– చైనా సరిహద్దు వెంట ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో.. మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎన్‌ఓ తాజా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు చైనా కవ్వింపు చర్యలతో తూర్పు లదాఖ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు అంతకంతకు తీవ్రతరమవుతున్నాయి. రెండు వారాల క్రితం ఈ ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ దిగడంతో వివాదం మరింత పెద్దదయ్యింది. ఈ క్రమంలోనే భారత్‌కు కేవలం 3 కి.మీ. దూరంలో పాంగాంగ్‌ సరస్సు సమీపంలో 5 వేలకుపైగా సైనికుల్ని మోహరించినట్లు తెలుస్తోంది. (ఎవరెస్ట్‌ ఎత్తుపై చైనా అభ్యంతరం)

చైనా చర్యలతో భారత్‌ కూడా అప్రమత్తమైంది. వాస్తవాధీన రేఖ మీదుగా బలగాలను మరింత పటిష్టం చేసింది. భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవాణే తూర్పు లదాఖ్‌ ప్రాంతంలో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. పరిస్థితుల్ని మరింత విశ్లేషించడానికి భారత ఆర్మీ టాప్‌ కమాండర్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆర్మీ ఛీప్‌తో పలుమార్లు చర్చలు జరిపారు.

మరిన్ని వార్తలు