కశ్మీర్‌పై నాడు పా​కిస్తాన్‌.. నేడు చైనా

16 Aug, 2019 11:39 IST|Sakshi

1965లో తొలిసారి యూఎన్‌ఓలో రహస్య చర్చ

కశ్మీర్‌పై నాడు పాక్‌ నేడు చైనా ఫిర్యాదు

న్యూయార్క్‌: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్‌ రద్దు చేయడంపై  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అరుదైన సమావేశాన్ని నిర్వహించనుంది. చైనా అభ్యర్థన మేరకు శుక్రవారం నాడు రహస్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు భద్రతా మండలి తెలిపింది. కాగా ఓ అంశంపై రహస్య పద్దతిలో (గోప్యంగా) సమావేశాన్ని నిర్వహించడం 55 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. కశ్మీర్‌ అంశంపై పాకిస్తాన్‌ ఫిర్యాదుపై స్పందించిన యూఎన్‌ఎస్‌సీ 1965లో తొలిసారి ఇలా రహస్య సమావేశాన్ని నిర్వహించింది. తాజాగా చైనా విజ్ఞప్తి మేరకు ఈ విధంగా రహస్య సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఐరాసలో బహిరంగ చర్చను నిర్వహింపజేయడంలో పాక్‌ విఫలమైనట్లయింది. కశ్మీర్‌ అంశంపై భద్రతా మండలి చర్చించడం చాలా అరుదని యూఎన్‌ఎస్‌సీ పేర్కొంది.

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక​ ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంపై పాకిస్తాన్‌, చైనా ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక బృందం నేతృత్వంలో శుక్రవారం సమావేశం నిర్వహించనున్నట్లు యూఎన్‌ఎస్‌సీ అధ్యక్షుడు జోనా రోనెకా తెలిపారు. మరోవైపు కశ్మీర్‌ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో తాను ప్రతినిధిగా వ్యవహరిస్తానని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇదివరకే వ్యాఖ్యానించారు. దీనిపై చైనా మద్దతును కూడా ఆయన కోరారు.  కాగా కశ్మీర్‌ విషయంలో భారత్‌ అనుసరిస్తున్న విధానాలపై స్పందించాల్సిందిగా పాకిస్తాన్‌ అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్న విషయం తెలిసిందే.

‘ప్రస్తుతం భారత్‌ అనుసరిస్తున్న విధానాలు ఐక్యరాజ్యసమితి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి. భారత్‌ అక్రమ చర్యలకు పాల్పడుతోందని మేము భావిస్తున్నాం. ఈ విషయంపై ప్రత్యేక సమావేశం జరపాల్సిందిగా’ కోరుతున్నాం అని పాక్‌ యూఎన్‌ఓకి రాసిన లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని చైనా యూఎన్‌ఎస్‌సీ అధ్యక్షుడితో చర్చించిన క్రమంలో శుక్రవారం భేటీ జరుగనుంది. కాగా ఇటీవల చైనాలో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌.. కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. అయితే ఈ రహస్య సమావేశం ద్వారా పాక్‌కు ఏమాత్రం ప్రయోజనం కలిగే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు