యుద్ధనేరాల విచారణకు ఐరాస నిధులు

29 Dec, 2019 02:24 IST|Sakshi

2020 బడ్జెట్‌ను ప్రకటించిన ఐరాస

ఐక్యరాజ్య సమితి: సిరియా, మయన్మార్‌లలో జరిగిన యుద్ధ నేరాల విచారణ కోసం ఐక్యరాజ్య సమితి తన బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. 2020 సంవత్సరానికి గాను ఐరాస సర్వ ప్రతినిధి సభ శుక్రవారం 307 కోట్ల డాలర్లను కేటాయించింది. గత ఏడాదితో పోల్చి చూస్తే బడ్జెట్‌ స్వల్పంగా పెరిగింది. 2019లో 290 కోట్ల డాలర్ల బడ్జెట్‌ ఉండేది. ఐక్యరాజ్య సమితి సచివాలయానికి అదనపు బాధ్యతలు అప్పగించడం, ద్రవ్యోల్బణం, డాలర్‌ మారకం విలువలో తేడాల కారణంగా బడ్జెట్‌ను పెంచినట్టు యూఎన్‌ దౌత్యవేత్తలు వెల్లడించారు.

యెమన్‌లో పరిశీలకుల బృందం, హైతిలో రాజకీయ బృందాల ఏర్పాటు, సిరియా అంతర్యుద్ధం, మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలపై జరిగిన దాడులకు సంబంధించిన నేరాలపై విచారణకు ఈ బడ్జెట్‌లో నిధుల్ని వినియోగించనున్నారు. ఇలా యుద్ధ నేరాల విచారణకు ఐక్యరాజ్య సమితి నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. గతంలో యూఎన్‌ స్వచ్ఛందంగా ఈ నేరాల విచారణకు ఆర్థిక సాయాన్ని అందించేది. జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం 600 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రకటించింది. ఇప్పుడు కొత్త సంవత్సరం వేళ ప్రత్యేకంగా మరో బడ్జెట్‌ను ప్రకటించింది.

కొత్త సైబర్‌ ఒప్పందం
ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ నేరాలు అధికమవుతుండడంతో వాటిని నిరోధించడానికి ఒక కొత్త అంతర్జాతీయ ఒప్పందాన్ని ఐరాస రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని శుక్రవారం ఐరాస సర్వ ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని యూరోపియన్‌ యూనియన్, అమెరికా, మరికొన్ని దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యూఎన్‌లో ఈ తీర్మానం 79–60 ఓట్ల తేడాతో గట్టెక్కింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన నిపుణులతో ఒక కమిటీ వేసి సైబర్‌ నేరాలు నిరోధించడానికి కసరత్తు జరుగుతుంది.

మరిన్ని వార్తలు