యూఎన్‌ భద్రతామండలిలో కశ్మీర్‌ అంశంపై చర్చ

16 Aug, 2019 20:57 IST|Sakshi

న్యూయార్క్‌ : కశ్మీర్‌ అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి రహస్య సమావేశం నిర్వహించింది. ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌ పట్ల భారత ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని, జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రష్యా భారత్‌కు పూర్తి మద్దతుగా నిలిచింది. కశ్మీర్‌ అంశంపై భారత్‌-పాకిస్తాన్‌ ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేసింది. ఈ అంశంపై యూన్‌ భద్రతా మండలిలో చర్చించొద్దని తేల్చిచెప్పింది. ఇక ఆర్టికల్‌ 370 రద్దుతో భారత్‌ కశ్మీర్‌పై అన్యాయం చేస్తోందని గగ్గోలు పెడుతున్న పాకిస్తాన్‌ తొలుత అమెరికా తలుపు తట్టింది.

కశ్మీర్‌ విషయం పూర్తిగా భారత్‌ అంతర్గతమని అమెరికా తేల్చిచెప్పడంతో.. చైనాకు సాగిలపడిన దాయాది దేశం ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్‌ అంశంపై పట్ల చర్చ పెట్టాలని కోరింది. దీంతో ఈ విషయంలో యూఎన్‌ భద్రతా మండలి శుక్రవారం రాత్రి 7.30 గంటలకు సమావేశమైంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత  సభ్యదేశాలైన ఫ్రాన్స్‌, యూకే కూడా  కశ్మీర్‌ అంశం భారత్‌-పాకిస్తాన్‌ ద్వైపాక్షిక అంశమని ఇప్పటికే చెప్పాయి. రహస్య సమావేశం అనగా మీడియాకు అనుమతి లేకపోవడమే.

మరిన్ని వార్తలు