-

కిమ్‌ అసలైన ‘వారసుడు’ అతడే!

29 Apr, 2020 10:16 IST|Sakshi
ఫొటో కర్టెసీ: రాయిటర్స్‌ వార్తా సంస్థ

ప్యాంగ్‌యాంగ్‌: ఉత్తర కొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లేనందున తరువాతి అధ్యక్షుడు ఎవరనే విషయంపై చర్చలు కొనసాగుతున్నాయి. కిమ్‌ చిన్న చెల్లెలు కిమ్‌ యో జంగ్‌ సమర్థురాలిగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పురుషాధిక్యత కలిగిన ఉత్తర కొరియా సమాజంలో ఒక మహిళకు అధికారం అప్పగిస్తారా అన్నది అనుమానమేనన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కిమ్‌ చిన్నాన్న కిమ్‌ ప్యాంగ్‌ ఇల్‌ (65) పేరు బయటికొచ్చింది. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌ వారసుల్లో ప్యాంగ్‌ ఇల్‌ చివరివాడు. ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షుడిగా ఆయనకే అన్ని అర్హతలు ఉన్నాయని ఆ దేశంలోని కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు నలభై ఏళ్ల అనంతరం రాజకీయంగా ఆయన పేరు వినిపిస్తుండటం గమనార్హం.
(చదవండి: కిమ్‌ ఆరోగ్యంపై గందరగోళం)


కావాలనే పక్క పెట్టేశారు
1970లో తన అన్న కిమ్‌ జోంగ్‌ ఇల్‌ చేతిలో ఓడిపోయిన తర్వాత.. కిమ్‌ ప్యాంగ్‌ ఇల్‌ హంగేరి, బల్గేరియా, ఫిన్‌లాండ్‌, పొలాండ్‌, చెక్‌ రిపబ్లిక్‌ దేశాల్లో పలు దౌత్యపరమైన పదవుల్లో పనిచేశారు. ఏడాది క్రితం స్వదేశానికి తిరిగొచ్చారు. కిమ్‌ అనారోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. దేశానికి నాయకత్వం వహించే విషయమై కిమ్‌ ప్యాంగ్‌ ఇల్‌ను కావాలనే పక్కన పెట్టేశారని, ఆ దేశ మీడియా అతన్ని వెలుగులోకి రానీయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే, ఉత్తర కొరియాలోని కొందరు మేధావులు మాత్రం.. వ్యవస్థాపకుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌ కుమారుడు అయినందున కిమ్‌ ప్యాంగ్‌ ఇల్‌ నిజమైన వారసుడు అని, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కానేకాదని చెప్తున్నారు. ఒకవేళ కిమ్‌ ప్రాణాలతో లేకపోతే.. ఇప్పుడైనా ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. కాగా, కిమ్‌ జోంగ్‌ ఇల్‌ 1994 నుంచి 2011 వరకు ఉత్తర కొరియా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన తదనానంతరం కిమ్‌ జోంగ్‌ ఉన్న పదవిని చేపట్టారు. మరోవైపు కరోనాకు భయపడే అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అజ్ఞాత జీవితం గడుపుతున్నారనే కథనాలు వెలువడుతున్నాయి.
(చదవండి: కిమ్‌ ఎక్కడున్నారో తెలుసు: దక్షిణ కొరియా)

మరిన్ని వార్తలు