నలంద కు యునెస్కో గుర్తింపు!

16 Jul, 2016 13:48 IST|Sakshi
నలంద కు యునెస్కో గుర్తింపు!

పాట్నాః  దక్షిణాసియాలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయంగా పేరుపొందిన నలంద విశ్వవిద్యాలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. ప్రపంచ చారిత్రక సంపద జాబితాలో బీహార్ లోని నలందకు యునెస్కో స్థానం కల్పించింది. టర్కీలోని ఇస్తాంబుల్ లో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 40వ సమావేశం సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా యునెస్కో ఆసియా డైరెక్టర్ జనరల్ ఇరినా బొకొనాకు భారత సాంస్కృతిక శాఖ కృతజ్ఞతలు తెలిపింది.

పాట్నాకు 98 కిలోమీటర్ల దూరంలో నలంద మహావీర విశ్వవిద్యాలయానికి యునెస్కో ప్రత్యేక గుర్తింపునిచ్చింది. బోధ్ గయ లోని మహాబోధి ఆలయం తర్వాత, యునెస్కో గుర్తింపు పొందిన రెండవ చారిత్రక సంపద నలంద.  గుప్తుల నేతృత్వంలో ప్రారంభమైన అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయంగా పేరొందిన నలంద.. ప్రపంచంలోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటి. విజ్ఞాన బోధనలో 800 సంవత్సరాల చరిత్ర కలిగిన నలందా లోని విద్యా సంప్రదాయాల్లో బౌద్ధమతం, సన్యాసం వంటివి కనిపిస్తాయని యునెస్కో తన వెబ్ సైట్ లో పేర్కొంది.  క్రీ.శ. 427 నుంచి క్రీ.శ. 1197 వరకూ బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా ఉన్న ఈ విద్యాలయం చరిత్ర ఆధారంగా చూస్తే.. ప్రపంచంలోని తొలి విశ్వవిద్యాలయాల్లోనూ ఒకటి. బుద్ధుని కాలంలో అత్యంత జనాభా కలిగిన నగరంగా నలందా అభివృద్ధి చెందినప్పటికీ, ఆ తర్వాత చాలా కాలానికి గానీ అదో విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందలేదు. ఒకప్పుడు జైనమత కార్యకలాపాలకు కేంద్రమైన నలంద లో మహావీరుడు బసచేసినట్లు చారిత్రక కథనం.  

మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ ఆఫ్ పారిస్ ఆధారిత అంతర్జాతీయ కౌన్సిల్ లోని నిపుణుల బృందం  గత యేడాది  నలంద యూనివర్శిటీని సందర్భించింది.  ఈ చారిత్రక సంపదకు యునెస్కో గుర్తింపు లభించే అవకాశం ఉండటంతో వారు  బీహార్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం సాంస్కృతిక శాఖ 200 పేజీల నామినేషన్ పత్రాన్ని వారికి అందించింది. 12 హెక్టార్లకు పైగా విస్తరించి ఉన్న నలంద ను పరిశీలించిన జపనీయుల నిపుణుడు మసాయా మట్సు వారసత్వ సంపదగా గుర్తించడంపై  సానుకూలంగా నోట్ ఇవ్వడంతో నలందా యునెస్కో ప్రపంచ చారిత్రక సంపద జాబితాలో చేరిపోయింది.

మరిన్ని వార్తలు