యువతపై ‘ఉగ్ర’ వల

29 Apr, 2020 01:54 IST|Sakshi

లాక్‌డౌన్‌ సమయంలో సోషల్‌ మీడియాలో విద్వేష ప్రచారంపై ఐక్యరాజ్య సమితి ఆందోళన

ఐక్యరాజ్యసమితి: కోవిడ్‌–19ను అడ్డం పెట్టుకొని ఉగ్రవాద సంస్థలు సోషల్‌ మీడియా ద్వారా యువతపై వల వేస్తున్నాయని ఐక్యరాజ్య సమితి(ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో పనిలేక తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్న యువతను ఆకర్షించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని తెలిపింది. అసాధారణ పరిస్థితులున్న ఈ తరుణంలో ఒక తరాన్ని పోగొట్టుకోలేమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెర్రస్‌ అన్నారు. యువత, శాంతిభద్రతలు అనే అంశంపై చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించి అయిదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని జరిగిన సమావేశంలో ఆంటోనియో మాట్లాడారు.

ఉగ్రవాద సంస్థలు యువతను లక్ష్యంగా చేసుకోవడాన్ని టార్గెట్‌ చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. ‘లాక్‌డౌన్‌తో ప్రపంచవ్యాప్తంగా యువత ఎక్కువగా ఆన్‌లైన్‌లో కాలం గడిపేస్తోంది. దీనిని అనుకూలంగా తీసుకున్న కొన్ని సంస్థలు సామాజిక మాధ్యమాల్లో విద్వేషాన్ని రగిలిస్తూ వారిని రిక్రూట్‌ చేసుకుంటున్నాయి’అని ఆంటోనియో వెల్లడించారు. యువతలో నెలకొన్న తీవ్ర నిరాశ, నిస్పృహలను ఆయా దేశాల ప్రభుత్వాలు తొలగించకపోతే, ఉగ్రవాదం వైపు యువత ఆకర్షితులవుతారని ఆంటోనియో హెచ్చరించారు.

అమెరికాలో తగ్గుతున్న మృతులు 
అగ్రరాజ్యంలో కోవిడ్‌ మృతుల సంఖ్య క్రమేపి తగ్గుముఖం పడుతోంది. సోమవారం న్యూయార్క్‌లో 337 మంది, న్యూజెర్సీలో 106 మంది మరణించారు. అమెరికాలో మృతుల సంఖ్య 70వేల వరకు చేరుకోవచ్చునని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అంతర్జాతీయ సంస్థలు వేసిన అంచనాల కంటే ఇది తక్కువగానే ఉంటుందని చెప్పారు.  టెక్సాస్‌లో శుక్రవారం నుంచి మాల్స్, రెస్టారెంట్లకు కూడా అనుమతినిస్తామని ఆ రాష్ట్ర గవర్నర్‌ తెలిపారు.  
► బ్రెజిల్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. 67వేలకు పైగా కేసులు నమోదైతే, 4,600 మందికి పైగా మృతి చెందారు. 
► న్యూజిలాండ్‌లో మంగళవారం కేవలం మూడు కేసులు నమోదు కాగా, ఆస్ట్రేలియాలో కేవలం ఒక్క కేసు నమోదైంది. దీంతో ప్రభుత్వం ఆంక్షల్ని సడలించింది. సిడ్నీలో బీచ్‌లను తెరిచింది. 
► యూరప్‌ దేశాల్లో పాఠశాలలను ఎప్పుడు తెరవాలన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి. పిల్లలపై కరోనా అంతగా ప్రభావం చూపించదని అధ్యయనాలు చెబుతున్నప్పటికీ తల్లిదండ్రులు ఆందోళనగా ఉన్నారు. 

కరోనా భయంతోనే కిమ్‌ అజ్ఞాతం? 
కరోనా వైరస్‌ ఎక్కడ సోకుతుందోనన్న భయంతోనే ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తన తాత జయంతి ఉత్సవాలకు దూరంగా ఉన్నారని దక్షిణ కొరియా మంత్రి ఒకరు చెప్పారు. ఉత్తర కొరియా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ వేడుకలకు కిమ్‌ హాజరుకాకపోవడంతో ఆయన ఆరోగ్యంపై రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వాటిల్లో ఏ మాత్రం వాస్తవం లేదని కరోనా భయాందోళనలతోనే ఆయన వేడుకలకి గైర్హాజరయ్యారని, అజ్ఞాతజీవితం గడుపుతున్నారని ఆ మంత్రి చెప్పారు.   

అధిక కరోనా కేసులున్న దేశాలు

మరిన్ని వార్తలు