అర్హతల ఆధారంగానే వలసలకు అనుమతి

24 Jun, 2018 02:50 IST|Sakshi
వలస విధానంపై ప్రసంగిస్తున్న ట్రంప్‌

సరిహద్దులను కట్టుదిట్టం చేస్తాం:ట్రంప్‌

వాషింగ్టన్‌: అర్హతల ఆధారంగానే వలసలను అనుమతిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. అనధికారికంగా ఎవరూ దేశంలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తామన్నారు. కఠిన వలస విధానాలపై ఇంటాబయటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రతిపక్ష డెమోక్రాట్లు, మీడియా తీరుపైనా ఆయన విరుచుకుపడ్డారు. అక్రమ వలసదారుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను, బాధితులను శనివారం ట్రంప్‌ వైట్‌హౌస్‌లో కలుసుకుని మాట్లాడారు. దేశ సరిహద్దులతోపాటు పౌరులకు కూడా భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్నారు.

ఇతర దేశాల వారు ఇక్కడికి రావడాన్ని కోరుకుంటున్నామనీ, అయితే, అది పద్ధతి ప్రకారం మాత్రమే జరగాలన్నారు. ‘సమర్థత ఆధారంగానే వలసలను కోరుకుంటున్నాం. అంతేకానీ, అనర్హులకు కూడా అనుమతి ఇచ్చే డ్రా విధానాన్ని మాత్రం కాదు’ అని ‘యాంజెల్‌ ఫ్యామిలీస్‌’గా పేర్కొనే బాధిత కుటుంబాలతో అన్నారు. ‘విదేశీ నేరగాళ్ల కారణంగానే దేశంలో నేరాల రేటు పెరుగుతోంది. బాధిత కుటుంబాల ఇబ్బందులపై చర్చించటానికి ప్రతిపక్ష డెమోక్రాట్లతోపాటు, బలహీన వలస విధానాలను బలపరిచే కొందరు ఇష్టపడడం లేదు’ అని ట్రంప్‌ ఆరోపించారు.   2011 గణాంకాల ప్రకారం విదేశీ నేరగాళ్ల కారణంగా దేశంలో 25వేల హత్యలు, 42వేల దోపిడీలు, 70వేల లైంగిక నేరాలు, 15వేల కిడ్నాప్‌లు జరిగాయని తెలిపారు.

గత ఏడేళ్లలో ఒక టెక్సస్‌లోనే 6 లక్షల నేరాలకు సంబంధించి 2.5లక్షల మందిని అరెస్ట్‌ చేశామన్నారు. ‘హెరాయిన్‌ అతిగా తీసుకున్న కారణంగా కేవలం 2016లోనే 15వేల మంది చనిపోయారు. దేశంలోకి అక్రమంగా సరఫరా అయ్యే హెరాయిన్‌లో 90 శాతం దక్షిణ సరిహద్దుల నుంచే వస్తోంది’ అని అన్నారు. 2017లో అరెస్టయిన 8 వేల మంది విదేశీ నేరగాళ్లను బలహీన చట్టాల కారణంగానే విడిచి పెట్టాల్సి వచ్చిందన్నారు. ‘ప్రజలను చంపేస్తోన్న డ్రగ్స్‌ సరఫరాదారులను పట్టుకుని వదిలి పెడుతుంటే ఈ మీడియా ఏం చేస్తోంది’ అని ప్రశ్నించారు. అక్రమ వలస నేరగాళ్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు, ఇబ్బందులు పడిన వారికి సాయ పడేందుకు ‘వాయిస్‌’ అనే విభాగాన్ని ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ట్రంప్‌ 2017లో ఏర్పాటు చేశారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు