చూస్తున్నారుగా.. అందరికీ ఇదే శిక్ష పడుతుంది!

20 Mar, 2019 19:29 IST|Sakshi

జకార్తా : ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నడిచిన ముస్లిం అవివాహిత యువతీ యువకులకు చేదు అనుభవం ఎదురైంది. పెళ్లి కాకుండా నీతి మాలిన చర్యకు పాల్పడి షరియా చట్టాలను ఉల్లంఘించారంటూ.. వారికి జైలు శిక్ష విధించడంతో పాటు కొరడా దెబ్బలు తినాల్సిందిగా మతాధికారులు ఆదేశించారు. ఇండోనేషియాలోని అకే ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమత్రా ఐలాండ్‌లోని ఇస్లాం చట్టప్రకారం గ్యాంబ్లింగ్‌, మద్యం సేవించడం, స్వలింగ సంపర్కం వంటి చర్యలను తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఎవరైనా అలా ప్రవర్తించినట్లైతే వారికి కఠిన శిక్షలు అమలు చేస్తారు.

ఈ నేపథ్యంలో ఐదు యువజంటలు విపరీత చేష్టలకు పాల్పడ్డారంటూ మత పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తప్పు చేసినందుకు ప్రాయశ్చిత్తం అనుభవించాలంటూ 22 కొరడా దెబ్బలు విధించారు. ఈ క్రమంలో షరియా అధికారి మాట్లాడుతూ.. ‘ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అందరూ జాగ్రత్తగా ఉండాలి. లేనట్లైతే ఇలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని శిక్ష అమలు చేస్తున్న సమయంలో చూస్తున్న చిన్నారులు, పెద్దలను హెచ్చరించారు. కాగా ఇలాంటి క్రూర చర్యలకు తీవ్రమైన నేరంగా పరిగణించాలని వామపక్షాలు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ఇది మతంతో ముడిపడిన సున్నిత అంశం కావడంతో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు