రేపే చరిత్రాత్మక భేటీ

11 Jun, 2018 02:47 IST|Sakshi
ఆదివారం సింగపూర్‌కు చేరుకున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

సింగపూర్‌ చేరుకున్న ట్రంప్, కిమ్‌

ఉ.కొరియా అణునిరాయుధీకరణే అజెండాగా చర్చలు

సింగపూర్‌: కొరియా ద్వీపకల్పంలో శాంతిస్థాపన లక్ష్యంగా అమెరికా–ఉత్తర కొరియా అధినేతల మధ్య మంగళవారం సింగపూర్‌లో జరగనున్న శిఖరాగ్ర సమావేశం కోసం సర్వం సిద్ధమైంది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చరిత్రాత్మక భేటీ కోసం ఆదివారం సాయంత్రమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సింగపూర్‌ చేరుకున్నారు. మంగళవారం సింగపూర్‌లోని కపెల్లా హోటల్లో ట్రంప్, కిమ్‌ భేటీ జరగనుంది.

ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమంపై కొనసాగుతున్న ప్రతిష్టం భనకు పరిష్కారం చూపడమే ఎజెండాగా ఇరువురు నేతలు చర్చలు జరపనున్నారు. కెనడాలో జరుగు తున్న జీ–7 సదస్సును ముగించుకుని ట్రంప్‌ నేరుగా ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో సింగపూర్‌ చేరుకు న్నారు. అంతకు కొద్ది గంటలముందు ప్రత్యేక విమానంలో కిమ్‌ సింగపూర్‌ చేరుకున్నారు. విమానాశ్రయంలో కిమ్‌కు సింగపూర్‌ విదేశాంగ మంత్రి వి.బాలకృష్ణన్‌ స్వాగతం పలికారు.

భారీ భద్రత నడుమ ఆయన సెయింట్‌ రెగిస్‌ హోటల్‌కు చేరుకున్నారు. అనంతరం సింగపూర్‌ ప్రధాని లీ సియన్‌ లూంగ్‌తో భేటీ అయ్యారు. ‘యావత్‌ ప్రపంచం ఉ.కొరియా, అమెరికా మధ్య జరగనున్న చారిత్రక సదస్సు కోసం ఎదురుచూ స్తోంది. భేటీ కోసం మీరు చేసిన ఏర్పాట్లకు ధన్యవాదాలు’ అని లీకి కిమ్‌ చెప్పారు. అణ్వాయుధాల్ని విడిచి పెట్టేందుకు ఉత్తరకొరియా అంగీకరిస్తుందని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు సింగపూర్‌ ప్రధాని లీతో ఆయన భేటీ కానున్నారు.

ఉ.కొరియా అణ్వస్త్రాల్ని విడిచిపెడుతుందా?
అయితే సదస్సు విజయవంతంపై పలు సందేహాలు నెలకొన్నాయి. అమెరికా ప్రధాన భూభాగంపై కూడా దాడిచేయగల సత్తా ఉన్న ఉత్తర కొరియా.. ఎంతో కష్టపడి సాధించుకున్న అణ్వాయుధాల్ని వదులుకు నేందుకు అంత సులువుగా అంగీకరిస్తుందా? అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై చర్చల్లో పాల్గొనడం కిమ్‌కు ఇదే మొదటిసారి కావడంతో సదస్సు సందర్భంగా ఎలా వ్యవహరిస్తారో? అన్న ఆసక్తి నెలకొంది. 2011లో ఉత్తర కొరియా అధినేతగా కిమ్‌ బాధ్యతలు చేపట్టిన అనంతరం మూడు సార్లు మాత్రమే విదేశీ భూభాగంపై అడుగుపెట్టారు. రెండు సార్లు చైనాలో పర్యటించగా.. గత నెల్లో ఉభయ కొరియా సరిహద్దు ప్రాంతంలో దక్షిణ కొరియా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. కాగా అమెరికా అధ్యక్షుడితో ఉత్తర కొరియా కీలక నేత ఒకరు నేరుగా చర్చలు జరపడం ఇదే మొదటిసారి.  
 

మరిన్ని వార్తలు