26/11 దాడులు: అమెరికా భారీ రివార్డు

26 Nov, 2018 11:11 IST|Sakshi

వాషింగ్టన్‌: ముంబైలో 26/11 మరణహోమం జరిగి పదేళ్లు గడిచిన సందర్భంగా అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడుల వెనుక ఉన్న వారి గురించి సమాచారం ఇచ్చిన వారికి భారీ నజరానా అందజేయనున్నట్టు ప్రకటించింది. 166 మందిని పొట్టనబెట్టుకున్న ఈ ఉగ్రదాడి సూత్రధారుల గురించి కానీ, దాడులకు ప్రేరేపించిన వారి గురించి కానీ సమాచారం తెలియజేస్తే వారికి 5 మిలియన్‌ డాలర్లు(దాదాపు 35 కోట్ల రూపాయలు) రివార్డు అందజేస్తామని యూఎస్ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పొంపియో తెలిపారు. ఈ ఉగ్రచర్య జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అమెరికా ప్రభుత్వం తరఫున, అమెరికా ప్రజల పక్షాన భారత ప్రజలకు, ముంబై వాసులకు ఆయన సంఘీభావం తెలిపారు.

ఈ అనాగరిక చర్య ప్రపంచం మొత్తాన్ని షాక్‌కు గురిచేసిందని పొంపియో అన్నారు. ఈ దాడిలో కుటుంబసభ్యులను కో​ల్పోయినవారికి, గాయపడ్డవారికి తాము అండగా ఉంటామని ప్రకటించారు. ఈ దాడిలో ఆరుగురు అమెరికా పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంతటి క్రూరమైన చర్య జరిగి పదేళ్లు గడిచినప్పటికీ.. ఈ దాడికి సూత్రధారులను పట్టుకుని శిక్షించకపోవడం బాధితుల కుటుంబాలను అగౌరవపరచడమేనని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు భాద్యులైన లష్కరే తోయిబాతో సహా దాని అనుబంధ సంస్థలపై అంక్షలు అమలు చేయాలని ఐకరాజ్యసమితి భద్రత మండలి తరఫున ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా పాకిస్తాన్‌ ఈ దుర్మార్గపు చర్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ముంబై దాడుల కారకులను న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి అమెరికా కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. కాగా, అమెరికా ఇలాంటి రివార్డు ప్రకటించడం ఇది మూడోసారి.

2008 నవంబర్‌ 26న భారత ఆర్థిక రాజధానిపై ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడిన పాక్‌ ఉగ్రమూకల బారిన పడి 166మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఉగ్రమూకలను మట్టుపెట్టే క్రమంలో పలువురు పోలీసులు వీర మరణం పొందారు. ఈ దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల్లో ఒకడైన కసబ్‌ను భద్రత బలగాలు సజీవంగా పట్టుకున్నాయి. కసబ్‌కు న్యాయస్థానం మరణశిక్ష విధించడంతో.. 2012లో అతడిని ఉరితీశారు. ఈ దాడికి కారకులను శిక్షించడంలో భారత్‌కు సహకరిస్తామని చెప్పిన దాయాది దేశం.. కుట్రదారులు వారి దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్న పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.  

సంబంధిత కథనాలు: 

మరో దాడి జరిగితే యుద్ధమే..!

26/11 పదేళ్ల ఉగ్ర జ్ఞాపకం

మరిన్ని వార్తలు