చైనాపై మరిన్ని ఆంక్షలు: అమెరికా

10 Jul, 2020 02:37 IST|Sakshi

వాషింగ్టన్‌:  చైనాపై ఒత్తిడిని మరింత పెంచాలని అమెరికా యోచిస్తోంది. డ్రాగన్‌ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించాలని భావిస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి, అమెరికాలో ఆ వైరస్‌ మృత్యుహేల నేపథ్యంలో ఇప్పటికే చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మండిపడ్తున్న విషయం తెలిసిందే. హాంకాంగ్‌లో కొత్త జాతీయ భద్రత చట్టం, వీఘర్‌ ముస్లింలపై వేధింపులు, టిబెట్‌లో భద్రతాపరమైన ఆంక్షలు.. మొదలైన వాటి విషయంలో అమెరికా ఆగ్రహంగా ఉంది. ‘ప్రసిడెంట్‌ ట్రంప్‌ను కాదని నేను ముందే చెప్పలేను. కానీ చైనాపై అమెరికా తీసుకోనున్న చర్చల గురించి మీరు త్వరలోనే వింటారు’ అని వైట్‌ హౌజ్‌ ప్రెస్‌ సెక్రటరీ కేలీ మెక్‌ఎనానీ బుధవారం మీడియాతో వ్యాఖ్యానించారు.  

కొత్త వీసా రూల్స్‌తో కష్టాలే
నూతన వీసా నిబంధనల వల్ల అమెరికాలోని భారతీయ విద్యార్థులు ఇబ్బందులను, అనిశ్చితిని ఎదుర్కొంటారని యూఎస్‌లోని భారత దౌత్యాధికారి పేర్కొన్నారు. యూఎస్‌లోని యూనివర్సిటీలు, కాలేజీలు తమ విద్యా సంవత్సర ప్రణాళికలను ఇంకా ప్రకటించని ప్రస్తుత పరిస్థితుల్లో జారీ అయిన ఈ నిబంధనలు భారతీయ విద్యార్థులను మరింత అనిశ్చితిలోకి, మరిన్ని కష్టాల్లోకి తీసుకువెళ్తాయని భారతీయ రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు.

ఈ విషయాన్ని భారత ప్రభుత్వం సంబంధిత అమెరికా అధికారుల దృష్టికి తీసుకువెళ్లిందన్నారు. భారత్, అమెరికా ప్రజల మధ్య సంబంధాల విషయంలో ఉన్నతవిద్యలో భాగస్వామ్యం అత్యంత కీలకమైన అంశమన్నారు. పూర్తిగా ఆన్‌లైన్‌ క్లాస్‌లకు మారిన విద్యాసంస్థల్లో చదువుతున్న విదేశీ విద్యార్ధులు స్వదేశాలకు వెళ్లాల్సిందేనని అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలతో ఎక్కువగా నష్టపోయేవారిలో భారతీయ విద్యార్థులే అధికం.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు