విమానం పంపండి: ఇరాన్‌కు అమెరికా విజ్ఞప్తి!

12 May, 2020 16:12 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న తమ దేశ పౌరులను వెనక్కి తీసుకువెళ్లాలని అగ్రరాజ్యం ఇరాన్‌కు విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ విమానం పంపాలని సూచించింది. ఈ మేరకు అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం తాత్కాలిక కార్యదర్శి కెన్‌ క్యుసినెల్లి స్పందిస్తూ, ‘‘మా దేశంలో అక్రమంగా నివసిస్తున్న ఏలియన్లు, అదే మీ దేశానికి చెందిన 11 మంది పౌరులను వెనక్కి పంపాలని ప్రయత్నిస్తున్నాం. వాళ్లు స్వదేశానికి రావాలని మీరూ కోరుకుంటున్నారు కదా. కాబట్టి చార్టర్‌ ఫ్లయిట్ పంపిస్తే బాగుంటుందేమో. ఒకేసారి ఆ 11 మందిని పంపించేస్తాం?’’ అని వ్యంగ్యపూరిత ట్వీట్‌ చేశారు. (నిబంధనల సడలింపు: మరణాలు రెట్టింపయ్యే అవకాశం!)

కాగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ఖైదీలను విడుదల చేయాలని భావిస్తున్నట్లు అమెరికా, ఇరాన్‌ దేశాలు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖైదీల అప్పగింత విషయంలో ఇరాన్‌ జాప్యం చేస్తోందంటూ అమెరికా అధికారులు ఆరోపించారు. ఈ క్రమంలోనే కెన్‌ ఈ విధంగా సోషల్‌ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఖైదీల అప్పగింత(ఇరు దేశాల) గురించి నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇక గతేడాది నవంబరులో అమెరికా వాణిజ్య రహస్యాలను తస్కరించాడనే ఆరోపణలతో ఇరాన్‌ ప్రొఫెసర్‌ సైరస్‌ అస్గారిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. (సొంత నౌక‌పై క్షిప‌ణిని ప్ర‌యోగించిన ఇరాన్‌)

ఈ క్రమంలో ఇటీవల అతడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ఓ మీడియా సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల అనంతరం అతడిని ఇరాన్‌కు పంపించేందుకు అమెరికా సిద్ధమైనట్లు సమాచారం. తద్వారా 2018లో స్విస్‌ కస్టడిలోకి వెళ్లి.. ప్రస్తుతం ఇరాన్‌లో చిక్కుకుపోయిన అమెరికా నావికాదళ సీనియర్‌ అధికారి మైఖేల్‌ వైట్‌ను వెనక్కి తీసుకురావాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఖైదీల అప్పగింత విషయంలో తాము ముందడుగు వేసినప్పటికీ అమెరికా నుంచి ఎటువంటి స్పందన లేదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ జావేద్‌ జారిఫ్‌ పేర్కొన్నట్లు స్థానిక మీడియా పేర్కొనడం కొసమెరుపు.

మరిన్ని వార్తలు