అమెరికాలో పడవ ప్రమాదం: భారతీయ దంపతుల మృతి

5 Sep, 2019 17:02 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో భారత్‌కు చెందిన భార్యభర్తలిద్దరు మరణించారు. స్కూబా డైవింగ్‌ కోసం వెళ్తున్న వీరి పడవ అగ్ని ప్రమాదానికి గురైన ఘటన కాలిఫోర్నియాలోని శాంటా క్రజ్ ద్వీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు... నాగ్‌పూర్‌కు చెందిన ప్రఖ్యాత శిశువైద్యుడు సతీష్ డియోపుజారి కుమార్తె అమెరికాలో దంత వైద్యురాలిగా పని చేస్తుండగా.. అల్లుడు ఓ ఫైనాన్స్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సతీష్‌ కుమార్తె, అల్లుడు స్కూబా డైవింగ్‌ కోసమని కాలిఫోర్నియాలోని శాంటా క్రజ్‌ ద్వీపానికి వెళ్లారు. ఆ సమయంలో వీరు ప్రయాణం చేస్తున్న పడవలో ఒక్కసారిగా పడవలో మంటలు చెలరేగి కాలిఫోర్నియా సముద్రతీరంలో మునిగిపోయింది.

ఆ సమయంలో పడవలో 33 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు డైవర్స్‌ ఉన్నట్లు సమాచారం. పడవ మునిగిపోవడం‍తో వీరిలో 34 మంది మరణించినట్లు తెలిసింది. ఐదుగురు డైవర్స్‌ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా డియో పుజారి రెండో కుమార్తె కూడా అమెరికాలోనే ఉంటున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆమె అధికారులను కలుసుకుని సాయం చేయాల్సిందిగా కోరారు. 

ఈ ప్రమాదం గురించి డియోపుజారి మాట్లాడుతూ.. తన కుమార్తె  అమెరికాలో దంత వైద్యురాలుగా పనిచేస్తోందని, అల్లుడు కూడా అమెరికాలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీ పనిచేస్తున్నట్లు తెలిపాడు. అయితే ఇప్పటివరకు తన కూతురు, అల్లుడి మరణంపై అమెరికా అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సతీష్‌ డియోపుజారి ఆవేదన వ్యక్తం చేశాడు. (చదవండి: కాలిఫోర్నియాలో ఘోర అగ్ని ప్రమాదం)

మరిన్ని వార్తలు