మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలి

1 Mar, 2019 04:16 IST|Sakshi

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ ప్రతిపాదన

ఐక్యరాజ్యసమితి: జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థ అధినేత మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ ప్రతిపాదించాయి. 15 సభ్య దేశాలున్న భద్రతా మండలిలో వీటో అధికారమున్న ఈ మూడు దేశాలు బుధవారం ఈ ప్రతిపాదన చేశాయి. ప్రతిపాదనను భద్రతా మండలి పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. పాకి స్తాన్‌ను కేంద్రంగా చేసుకుని భారత్‌లో పలు ఉగ్రదాడులకు సూత్రధారిగా వ్యవహరించిన మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్‌ చాన్నాళ్లుగా అభ్యర్థిస్తోంది.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ విషయంలో భారత్‌కు వివిధ దేశాల మద్దతు లభించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ మండలిలో ప్రతిపాదించడం ఇది నాల్గోసారి. పాక్‌తో సన్నిహిత సంబంధాలున్న చైనా తన వీటో అధికారంతో ప్రతిసారీ అడ్డుతగులుతోంది. పుల్వామాలో భారత భద్రతా దళంపై జరిగిన దాడిని ఖండించిన చైనా ఈసారి ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తే మసూద్, సంస్థ చరాస్తుల లావాదేవీలు స్తంభించిపోతాయి. ఆర్థిక వనరులు మూసుకుపోతాయి. ప్రతిపాదనకు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలంటూ భారత్‌ విజ్ఞప్తి చేసింది. పాక్‌ స్థావరంగా పనిచేస్తున్న అన్ని ఉగ్రసంస్థలను నిషేధించాలని కోరింది.

భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త తలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రెండు దేశాలు వెంటనే సమావేశమై తగిన చర్యలు తీసుకోవాలి. పరిస్థితి మరింత దిగజారిపోకుండా సంయమనం పాటించాలి. ఇరు దేశాలు బాధ్యతగా వ్యవహరించి శాంతిని నెలకొల్పాలి. ఐక్యరాజ్య సమితి అందరికీ అందుబాటులో ఉంటుంది. రెండు దేశాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం.
– ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గ్యుటెరెస్‌ 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా