కరోనా కీలక మందు : అమెరికా అద్భుత డీల్

1 Jul, 2020 15:13 IST|Sakshi

మొత్తం  రెమ్‌డిసివిర్ ఔష‌ధం కొనుగోలు

ఇక ప్రతీ రోగికి  మందు అందుబాటులో

వాష్టింగ్టన్ : క‌రోనా కల్లోలంతో విలవిల్లాడుతున్న అమెరికా కీలక  నిర్ణయం తీసుకుంది. అమెరికా ఔషధ దిగ్గజం గిలియడ్ సైన్సెస్ కు చెందిన  రెమ్‌డిసివిర్ ఔష‌ధాన్ని మొత్తం కొనుగోలు చేసింది. మూడునెలల కాలంలో  ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి కానున్న మొత్తం మందును అమెరికా సొంతం చేసుకుంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమ‌న్ స‌ర్వీసెస్ శాఖ  ఓ ప్రకటన విడుదల  చేసింది.(కరోనా : అమెరికాకు కొత్త హెచ్చరిక)

ప్రపంచ వ్యాప్తంగా స‌ర‌ఫ‌రా కావాల్సిన రెమ్‌డిసివిర్‌ ఔష‌ధాన్ని తమకే విక్రయించాల్సిందిగా డోనాల్డ్ ట్రంప్ సర్కార్ అద్భుతమైన ఒప్పందం కుదుర్చుకుందని అమెరికా ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి అలెక్స్ అజార్ ప్రకటించారు. సుమారు 5ల‌క్షలకు పైగా డోస్‌ల కొనుగోలుకు గిలియడ్‌తో డీల్ కుదిరినట్టు చెప్పారు. జూలై, ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్‌ మాసాలలో తయారయ్యే 90 శాతం రెమిడిసివిర్ ఔష‌ధం అమెరికాకు దక్కనుందన్నారు.  తద్వారా అమెరికాలో అవసరమైన ప్రతీ కరోనా రోగికి ఈ ఔషధం అందుబాటులో ఉంటుందన్నారు. కరోనా మహమ్మారినుంచి అమెరికా ప్రజలను రక్షించేందుకు శక్తివంచన లేకుండా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆజార్ వెల్లడించారు. కాగా కోవిడ్-19 చికిత్సకు గాను  అమెరికాలో లైసెన్సింగ్ అధికారులు ఆమోదించిన మొట్టమొదటి ఔషధం రెమ్‌డెసివిర్. 

చదవండి : కరోనా ఔషధం : పతంజలి కొత్త ట్విస్టు

మరిన్ని వార్తలు