యుద్ధనౌకలో కరోనా వ్యాప్తి.. కెప్టెన్‌ హెచ్చరికలు!

1 Apr, 2020 13:30 IST|Sakshi

నావికాదళ అధినాయకత్వానికి లేఖ రాసిన అమెరికా కెప్టెన్‌

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సైనికుల ప్రాణాలు కాపాడేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని అమెరికా విమాన వాహక యుద్ధనౌక థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ కెప్టెన్‌ నౌకాదళ అధినాయకత్వాన్ని కోరారు. తమ నౌకలో కరోనా వైరస్‌ సోకిన నావికులు ఉన్నారని.. వారికి క్వారంటైన్‌ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో సుమారు ఐదు వేల మందితో నిండిన నౌకలో అంటువ్యాధి ప్రబలడానికి ఎక్కువ సమయం పట్టబోదని హెచ్చరించారు. ఈ మేరకు నౌక కెప్టెన్‌ బ్రెట్‌ క్రోజియర్‌ నౌకాదళ ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు శాన్‌ఫ్రాన్సిస్కో క్రానికల్‌ కథనం ప్రచురించింది. ‘‘ఇప్పుడు మనం యుద్ధం చేయడం లేదు.  నావికులు మరణించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ సరైన రీతిలో స్పందించకపోయినట్లయితే విశ్వాసపాత్రులైన.. మన సంపదను కోల్పోవాల్సి ఉంటుంది’ అని ఆయన లేఖలో పేర్కొన్నట్లు వెల్లడించింది. (అమెరికాలో ఒక్కరోజే 865 కరోనా మరణాలు!)

కాగా ఈ విషయంపై స్పందించిన అమెరికా నౌకాదళ తాత్కాలిక కార్యదర్శి థామస్‌ మోడ్లీ.. మంగళవారం నాటి బ్రెట్‌ లేఖ గురించిన సమాచారం తనకు అందినట్లు తెలిపారు. బ్రెట్‌ మాటలతో ఏకీభవించకుండా ఉండలేమన్నారు. అయితే ప్రస్తుతం థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ నౌక గ్వామ్‌ పోర్టులో ఉందని.. అక్కడ సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. రూజ్‌వెల్ట్‌ క్రూయిజ్‌ షిప్‌ లాంటిది కాదని... అందులో ఆయుధాలు సహా విమానం కూడా ఉందని.. దానితో పాటు సైనికులు ప్రాణాలు కూడా తమకు ముఖ్యమేనన్నారు. (కరోనా: భారత సంతతి వైరాలజిస్టు మృతి)

ఇక అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ మరణాల సంఖ్య 4 వేలకు చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో పలువురు సైనికాధికారులు కూడా కరోనా బారిన పడినట్లు వార్తలు వెలువడుతుండటంతో.. భద్రతా కారణాల దృష్ట్యా ఈ విషయంలో గోప్యత పాటించాలని అధికార వర్గాలు ఆదేశించినట్లుస సమాచారం. అయితే మంగళవారం నాటికి విధుల్లో ఉన్న 673 మంది అధికారులు అంటువ్యాధి బారిన పడినట్లు పెంటగాన్‌ ఓ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కరోజులోనే 100గా నమోదైనట్లు పెంటగాన్‌ వర్గాలు వెల్లడించాయి. 

మరిన్ని వార్తలు