పాకిస్తాన్ కు సహకరిస్తానన్న అమెరికా..!

29 Mar, 2016 18:42 IST|Sakshi

ఇస్లామాబాద్: ఉగ్రవాదాన్ని రూపు మాపేందుకు జరిగే పోరాటంలో పాకిస్తాన్ కు సహకరిస్తామంటూ అమెరికా హామీ ఇచ్చింది.  లాహోర్ నగరంలోని గుల్షన్-ఇ-ఇగ్బాల్ పార్క్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిని అమెరికా ఖండించింది. వాషింగ్టన్ లో ఓ విలేకరుల సమావేశంలో అమెరికా ప్రభుత్వ ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ రేడియో వెల్లడించింది.

లాహోర్ ఉగ్రదాడి నేపథ్యంలో సోమవారం అమెరికా వెళ్లాల్సిన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్.. తన పర్యటనను రద్దు చేసుకున్నారు. వాషింగ్టన్ అణు సదస్సులో పాకిస్తాన్ తరపున ప్రాతినిథ్యం వహించేందుకు నవాజ్ షరీఫ్ అమెరికా వెళ్లాల్సివుంది. ఇంతలో ఆత్మాహుతి దాడి జరగడంతో పర్యటన రద్దు చేసుకున్నారు. నవాజ్ షరీఫ్ అమెరికా పర్యటన రద్దుకు గల కారణాన్ని తాము అర్థం చేసుకోగలమని కిర్బీ తెలిపారు. పాకిస్తాన్ ప్రజలకు అండగా అమెరికా నిలుస్తుందని  సమావేశంలో వెల్లడించారు.  

సుమారు 72 మందిని పొట్టన పెట్టుకుని, 250 మంది గాయపడటానికి కారణమైన పాకిస్తానీ తాలిబన్ గ్రూప్, జమాత్ ఉల్ అరార్  ఈ దాడికి బాధ్యత వహించాలని కిర్బీ అన్నారు. ఆదివారం సాయంత్రం క్రైస్తవులు ఈస్టర్ జరుపుకొనే సమయంలో ఈ దాడులు ఉద్దేశ్య పూర్వకంగా జరిపినట్లు ఉన్నాయని ఏషియన్ న్యూస్ సర్వీస్ తెలిపింది.

మరిన్ని వార్తలు