వీసా కావాలంటే ఆ వివరాలు చెప్పాల్సిందే

3 Jun, 2019 04:20 IST|Sakshi

‘సామాజిక ఖాతాల’ వివరాలు జతచేయాలి

అమెరికా సర్కారు కొత్త నిబంధన

ఏటా కోటిన్నర మందిపై ప్రభావం

వాషింగ్టన్‌: ఉగ్రవాదులు, ఇతర ప్రమాదకర వ్యక్తులను తమ దేశంలోకి రానీయకుండా అడ్డుకోవడం కోసం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారిలో దాదాపు అందరూ, తాము వాడుతున్న అన్ని సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలూ చెప్పాల్సిందేనంటూ కొత్త నిబంధనను శనివారం నుంచి అమల్లోకి తెచ్చింది. దీని ప్రభావం ఏటా ఒకటిన్నర కోటి మందిపై ఉండనుంది. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద భావజాలం ఎక్కువగా వ్యాప్తి చెందుతోందనీ, దేశ భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని అధికారులు అంటున్నారు.

అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి వివరాలను క్షుణ్నంగా పరిశీలించి, ఉగ్రవాదులు దేశంలోకి రాకుండా నిరోధించడంలో భాగంగానే ఇకపై సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలను కూడా దరఖాస్తుదారులు వెల్లడించాల్సిందేననే నిబంధనను తెచ్చినట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికారి ఒకరు చెప్పారు. తాత్కాలిక పర్యటన కోసం వచ్చే వారు సహా ఎవ్వరైనా ఈ వివరాలు తెలియజేయాల్సిందేననీ, ఒకవేళ ఎవరికైనా సామాజిక మాధ్యమాల్లో ఖాతాలే లేకపోతే వాళ్లు ఆ విషయమే చెప్పవచ్చని తెలిపారు. అయితే ఎవరైనా అబద్ధం చెప్పినట్లు తేలితే వలస నిబంధనలకు అనుగుణంగా చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని అధికారి హెచ్చరించారు. తమ దేశానికి వచ్చే విదేశీయుల వివరాలను పూర్తిగా పరిశీలించడంలో ఇదో కీలక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను 2017 మార్చిలోనే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇవ్వగా, దీనిని అమలును అమెరికా విదేశాంగ శాఖ 2018 మార్చిలో ప్రారంభించింది.

మరిన్ని వార్తలు