జరీఫ్‌కు వీసా నిరాకరించిన అమెరికా

7 Jan, 2020 14:50 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా జరిపిన డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ జనరల్‌ ఖాసీం సులేమానీ మరణించడంతో.. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల నుంచి పరస్పరం హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్‌ జరీఫ్‌కు వీసా నిరాకరించింది. గురువారం న్యూయార్క్‌లో జరగనున్న ఐకరాజ్య సమితి భద్రత మండలి సమావేశానికి జరీఫ్‌ హాజరు కావాల్సి ఉంది. ఈ సమావేశాల్లో సులేమానీ హత్యకు సంబంధించి ఆయన అమెరికా వైఖరిపై విమర్శలు చేసే అవకాశం ఉండటంతోనే.. ఆ దేశం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 

కాగా, 1947 యూఎన్‌ ‘హెడ్‌ క్వాటర్స్‌ ఒప్పందం’ ప్రకారం యూఎన్‌కు హాజరయ్యే విదేశాలకు చెందిన దౌత్యవేత్తలకు అమెరికా తమ దేశంలోకి అనుమతించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం భద్రత, తీవ్రదాదం, విదేశాంగ విధానం కారణాలను చూపి అమెరికా జరీఫ్‌కు వీసా నిరాకరించింది.  అలాగే దీనిపై స్పందించడానికి అమెరికా విదేశాంగ శాఖ ఇష్టపడలేదు. మరోవైపు ఇరాన్‌ తరఫు ప్రతినిధులు మాత్రం.. జరీఫ్‌ వీసాకు సంబంధించి అమెరికా నుంచి గానీ, యూఎన్‌ నుంచి గానీ ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని వెల్లడించారు. అమెరికా జరీఫ్‌కు వీసా నిరాకరించిందనే వార్తలపై స్పందించడానికి యూఎన్‌ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ నిరాకరించారు. 

గతేడాది ఏప్రిల్‌, జూలైలలో కూడా జరీఫ్‌ యూఎన్‌ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమయంలో జరీఫ్‌తోపాటు ఇతర అధికారులపై రవాణా పరమైన ఆంక్షలు విధించింది. వారిని న్యూయార్క్‌లోని కొద్ది ప్రాంతానికే పరిమితమయ్యేలా చేసింది. 

మరిన్ని వార్తలు