‘ఎర్రటి గులాబీ ఇచ్చాను.. గుడ్‌బై చెప్పుకొన్నాం’

4 Apr, 2020 17:13 IST|Sakshi

ఆదర్శంగా నిలిచిన వైద్య జంట

నిఖా అయిన పన్నెండు గంటల్లోనే విధుల్లో చేరిన వైనం

వాళ్లు ఇద్దరూ డాక్టర్లే... ఆమె పేరు నైలా షిరీన్‌.. అతడి పేరు కషీఫ్‌ చౌదరి.. ఒకరేమో న్యూయార్క్‌లో ఉంటారు.. మరొకరు లోవాలోని సెడార్‌ రాపిడ్స్‌లో.. వృత్తిపరంగానే కాకుండా వారిద్దరి మధ్య ఉన్న మరో సారూప్యత సామాజిక సేవ.. తండ్రి స్ఫూర్తితో కార్డియాక్‌ ఎలక్ట్రోసైకాలజిస్టుగా ఎదిగిన కషీఫ్‌ బొలివియాలో వాలంటీర్‌గా పనిచేస్తూ ఎంతో మందికి ఉచితంగా పేస్‌మేకర్లు అమర్చాడు. ఇక షిరీన్‌ సైతం న్యూయార్క్‌లో ప్రస్తుతం ఇంటర్నల్‌ మెడిసిన్‌ చీఫ్‌గా పనిచేస్తోంది. గ్వాటెమాలాలో జరిగిన ఓ సామాజిక కార్యక్రమంలో కలుసుకున్న వీరిద్దరు... సరదాగా కాఫీ తాగడానికి వెళ్లి.. ఆపై ఒకరి అభిరుచులను మరొకరు పంచుకుని అనతికాలంలోనే స్నేహితులుగా మారారు. 

ఆ తర్వాత తమ బంధాన్ని శాశ్వతం చేసుకునేందుకు మార్చిలో ముహూర్తం ఖరారు చేసుకున్నారు. నిఖాను అంగరంగ వైభవంగా చేసుకోవాలని భావించారు. అయితే ఇంతలోనే ఊహించని ఉపద్రవం ముంచుకు వచ్చింది. కరోనా వైరస్‌ రూపంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం మొదలుపెట్టింది. పెళ్లి.. ఆ తర్వాత హనీమూన్‌.. ఇంకా మరెన్నో కలలతో దాంపత్య జీవితాన్ని ప్రారంభించాలనుకున్న నైలా, కషీఫ్‌ల ఆశలపై నీళ్లు చల్లింది. అయితే పవిత్రమైన వైద్య వృత్తిలో ఈ జంట మహమ్మారికి ఏమాత్రం భయపడలేదు. (అమెరికాలో ప్రపంచ రికార్డు స్థాయి మరణాలు)

అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి తంతు పూర్తిచేసుకుంది. తన ఇంట్లో నిఖా జరిగిన అనంతరం వధువే స్వయంగా తన భర్తను ఎయిర్‌పోర్టులో దించేసింది. 12 గంటలపాటు భర్తతో కలిసి ఆనందపు క్షణాలను పంచుకుని వెంటనే విధుల్లో చేరిపోయింది. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న దృష్ట్యా ఎన్నెన్నో ఆస్పత్రులు తిరుగుతూ ప్రజలు అంటువ్యాధి బారిన పడకుండా కాపాడుతోంది. మరి భార్య ఇంతగా శ్రమిస్తుంటే కషీఫ్‌ ఊరికే కూర్చోగలడా. లోవాకు చేరుకున్న వెంటనే వైద్య సేవలు ఆరంభించాడు. లోవాలోని మెర్సీ మెడికల్‌ సెంటర్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రోగుల ఇబ్బందులు అడిగితెలుసుకుని పరిష్కారాలు చూపుతున్నాడు. (న్యూయార్క్‌ గవర్నర్‌ సోదరుడికి ‘కరోనా’)

ఇక కరోనా తమను భౌతికంగా దూరం చేసినా.. నైలా, కషీఫ్‌లు మాత్రం వీలుచిక్కినప్పుడల్లా వీడియో కాల్స్‌ చేసుకుంటూ మానసికంగా తామొక్కటేనన్న సందేశాన్ని పంచుతున్నారు. ‘‘ఆరోజు ఇద్దరం గుడ్‌బై చెప్పుకొన్నాం. అప్పుడు ఇద్దరి కళ్లల్లో సన్నని నీటిపొర. ఏదైతేనేం నేను కోరుకున్న అమ్మాయిని పెళ్లిచేసుకున్నా. తనకు ఎర్రటి గులాబీ ఇచ్చాను. తన గురించి నాకు చాలా బెంగగా ఉంది. అదే సమయంలో విధి నిర్వహణ పట్ల తనకున్న నిబద్ధత నన్ను గర్వపడేలా చేస్తోంది’’ అని అర్ధాంగిపై కషీఫ్‌ ప్రేమను చాటుకుlన్నాడు.

‘‘న్యూయార్క్‌ పరిస్థితి ఇప్పుడెలా ఉందో అందరికీ తెలుసు. పరిస్థితులు ఇంకా దిగజారేలా కనిపిస్తున్నాయి. ఈ మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి అన్నిటికీ సిద్దంగా ఉండాలి’’ అని నైలా తన డాక్టర్‌ భర్తకు ధైర్యం నూరిపోసింది. తన భర్త సూపర్‌ ఫన్నీ అని.. తనను బాగా నవ్విస్తాడని తాము కలిసి గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుంది. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ ఎంతో మంది వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారు. వారందరికీ హ్యాట్సాఫ్‌. వారితో పాటు నైలా- కషీఫ్‌ జంటకు సెల్యూట్‌ చేయాల్సిందే!!(కరోనా: న్యూయార్క్‌ గవర్నర్‌ భావోద్వేగం)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు