‘పాకిస్తాన్‌ను నమ్మలేం’

4 Nov, 2017 09:28 IST|Sakshi

వాషింగ్టన్‌ : ఉగ్రవాద వ్యతిరేక పోరులో పాకిస్తాన్‌ నిబద్ధతపై అమెరికా మరోసారి సందేహాలు వెలిబుచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరులో పాకిస్తాన్‌ నిబద్ధతపై కాంగ్రెస్‌ ఉప సంఘాలు రెండూ అనుమానాలు వ్యక్తం చేశాయి. అంతేకాక పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారిందనే అనుమానాలను కాంగ్రెస్‌ సభ్యుడు టెడ్‌ యాహో సబ్‌ కమిటీలు ముందు వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ రక్షణ కేంద్రంగా మారిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన తరువాత ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి.

అమెరికా సెనెట్‌లోని హౌస్‌ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ కమిటీ, ఆసియా, పసిఫిక్‌ అండ్‌ మిడిల ఈస్ట్‌ కమిటిలతో ట్రంప్‌ నవంబర్‌ 8న సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌లపైనే చర్చ జరగనుంది. అంతేకాక పాకిస్తాన్‌పై అనుసరించాల్సిన వ్యూహంపైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్‌ విషయంలో ట్రంప్‌ న్యూ పాలసీకి పాకిస్తాన్‌ సహకరించేది అనుమానమేనని ఆసియా, పసిఫిక్‌ సబ్‌ కమిటీ ఛైర్మన్‌ యాహో తెలిపారు. ఇదిలా ఉండగా.. ట్రంప్‌ న్యూ పాలసీ విషయంలో పాకిస్తాన్ వైఖరిపై సందేహాలతో.. ఆ దేశానికి ఇప్పటివరకూ ఇస్తున్న 1.1 బిలియన్‌ డాలర్ల నిధిని ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆపేసింది. 

>
మరిన్ని వార్తలు