తాలిబాన్ల మారణహోమం

17 Oct, 2017 15:47 IST|Sakshi

అఫ్గానిస్తాన్‌లో 71 మంది మృతి

పాక్‌లో అమెరికా డ్రోన్‌ దాడి... 26 మంది ఉగ్రవాదుల హతం  

ఖోస్ట్‌/పెషావర్‌: ఆగ్నేయ అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌ ఉగ్రవాదులు మంగళవారం పోలీసు శిక్షణా కేంద్రం, భద్రతా దళాలు లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు తెగబడి రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం 71 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడుల్లో మరో 200 మంది గాయపడ్డారు. తొలుత ఐదుగురు ఉగ్రవాదులు బాంబులతో కూడిన దుస్తులు ధరించి, తుపాకులు, పేలుడు పదార్థాలతో పక్తియా ప్రావిన్సులోని గార్డెజ్‌ పట్టణంలో ఉన్న పోలీసు శిక్షణా కేంద్రం వద్దకు చేరుకున్నారు.

అనంతరం ఇద్దరు ముష్కరులు శిక్షణా కేంద్రం ద్వారం వద్దకు వచ్చి పేలుడు పదార్థాలతో నిండిన కార్లతో ఆత్మాహుతికి పాల్పడ్డారు. తర్వాత మిగిలిన ఉగ్రవాదులు కూడా తుపాకులతో కాల్పులు ప్రారంభించారు. పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య ఐదు గంటల భీకర పోరు తర్వాత ముష్కరులందరినీ పోలీసులు అంతమొందించారనీ, పోలీసులు, పౌరులు సహా 41 మంది చనిపోయారని అఫ్గానిస్తాన్‌ హోం శాఖ వెల్లడించింది.

శిక్షణా కేంద్రం ప్రాంగణంలోనే సరిహద్దు పోలీసులు, అఫ్గాన్‌ ఆర్మీ, పక్తియా పోలీసు విభాగం ప్రధాన కార్యాలయాలు కూడా ఉంటాయి. బాధితుల్లో ఎక్కువ మంది వివిధ పనులపై అక్కడకు వచ్చిన పౌరులేనని అధికారులు తెలిపారు. మరో దాడి ఘటనలో 30 మంది దుర్మరణం చెందారు.  

పాక్‌లో అమెరికా డ్రోన్‌ దాడి
పాకిస్తాన్‌లోని ఖుర్రం జిల్లాలో అమెరికా డ్రోన్‌లతో దాడి చేసి తాలిబాన్‌ అనుబంధ సంస్థ హక్కానీకి చెందిన 26 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ఉగ్రవాదులు అఫ్గాన్‌లో దాడులు చేయడం గమనార్హం.

హక్కానీ ఉగ్రవాద సంస్థ అఫ్గానిస్తాన్‌లో ఎన్నో దాడులకు పాల్పడి వందలాది మందిని పొట్టనబెట్టుకుంది. విదేశీయులను అపహరించి, విడుదల చేయాలంటే డబ్బులు ఇవ్వాలని కూడా బెదిరిస్తుంటుంది. ఈ ఏడాదిలో పాకిస్తాన్‌లో ఉగ్రవాదులపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా