ప్రయాణికులకు అసౌకర్యం..భారీ జరిమానా!

14 Sep, 2019 10:29 IST|Sakshi

వాషింగ్టన్‌ : ప్రయాణికులను నాలుగు గంటల పాటు అసౌకర్యానికి గురి చేశారంటూ అమెరికా ప్రభుత్వం జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు భారీ జరిమానా విధించింది. రెండు పర్యాయాలు ప్రయాణికులను వేచి చూసేలా చేసినందుకు 3 లక్షల డాలర్లు(దాదాపు రూ. 21 కోట్లు) చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఈ ఏడాది జనవరి 4న టోక్యో నుంచి న్యూయార్క్‌ వెళ్లాల్సిన విమానం సాంకేతిక కారణాల వల్ల చికాగోలో ల్యాండ్‌ అయ్యింది. ఈ క్రమంలో ఎయిర్‌లైన్‌ స్టాఫ్ సహా ప్రయాణికులు నాలుగు గంటలకు పైగా అక్కడే వేచి చూడాల్సి వచ్చింది. అదే విధంగా మే 15న  టోక్యో-న్యూయార్క్‌ విమానంలో ఇంధనం నింపే కారణంతో... దానిని వాషింగ్టన్‌లోని డ్యూలెస్‌ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. దీంతో తీవ్ర ఇబ్బందికి గురైన ప్రయాణికులు..దాదాపు ఐదు గంటలు ఎదురు చూసిన తర్వాత గమ్యస్థానాలకు చేరుకున్నారు. 

ఈ క్రమంలో ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అమెరికా ప్రభుత్వం జపాన్‌ ఎయిర్‌లైన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రవాణా శాఖతో ఉన్న ఒప్పందం ప్రకారం జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ క్రమంలో జరిమానాలోని 60 వేల డాలర్లను ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికులకు పరిహారంగా చెల్లించనుంది. అదే విధంగా ఇలాంటి తప్పిదాలు ఏడాదిపాటు పునరావృతం చేయకుండా ఉంటే లక్షా ఇరవై ఒక్క వేల డాలర్లు మాఫీగా ఎయిర్‌లైన్స్‌ తిరిగి పొందనుంది. కాగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనే ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని దారి మళ్లించామే గానీ..ఉద్దేశపూర్వకంగా వారిని అసౌకర్యానికి గురిచేయలేదని జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ వివరణ ఇచ్చింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా