అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ కన్నుమూత

1 Dec, 2018 10:55 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ హెచ్‌. డబ్ల్యూ. బుష్‌(94) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 1989లో అమెరికా 41వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన పాలనలో తనదైన ముద్ర వేసి కీర్తి గడించారు. కాగా ఆయన మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామ, అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌, గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు..
సీనియర్‌ బుష్‌గా సుపరిచితులైన జార్జ్‌ హర్బర్ట్‌ వాకర్‌ బుష్‌ జూన్‌ 12, 1924లో మసాచుసెట్స్‌లోని మిల్టన్‌లో జన్మించారు. ఆయన ముద్దు పేరు పాపీ. బుష్‌ జన్మించిన కొద్ది కాలానికే ఆయన కుటుంబం గ్రీన్‌విచ్‌కు వెళ్లి స్థిరపడింది. దీంతో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది.

తర్వాత ఉన్నత విద్యకై 1938లో మసాచుసెట్స్‌లోని ఫిలిప్స్‌  అకాడమీలో చేరిన బుష్‌... స్టూడెంట్‌ కౌన్సిల్‌ సెక్రటరీ, కమ్యూనిటీ ఫండ్‌ రైజింగ్‌ గ్రూపు అధ్యక్షుడు, స్కూల్‌ న్యూస్‌ పేపర్‌ ఎడిటోరియల్‌ మెంబర్‌, బేస్‌బాల్‌, సాకర్‌ టీమ్స్‌ కెప్టెన్‌గా చిన్నతనంలోనే పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఇలా చిన్ననాటి నుంచే ఆయనకు నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి.

రెండో ప్రపంచ యుద్ధకాలంలో.. నేవీ అధికారిగా


18 ఏట గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అనంతరం(1941) బుష్‌ అమెరికా నౌకాదళంలో చేరారు. 10 నెలల శిక్షణ అనంతరం యూఎస్‌ నావల్‌ రిజర్వ్‌ విభాగంలో నావల్‌ ఏవియేటర్‌(పైలట్‌)గా నియమితులయ్యారు. టీనేజ్‌లోనే ఈ ఘనత సాధించిన బుష్‌ రికార్డు ఇప్పటి వరకు చెక్కుచెదరలేదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నేవీ అధికారి, ఫొటోగ్రఫిక్‌ ఆఫీసర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించిన బుష్‌.. అమెరికా సాధించిన పలు విజయాల్లో భాగస్వామి అయ్యారు.

ప్రేమ- పెళ్లి.. కుటుంబం


గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న సమయంలోనే జార్జ్‌ బుష్‌కు బార్బరా పియర్స్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం స్నేహితులుగా మెదిలిన వీరు.. ప్రేమికులుగా మారారు. ఆ తర్వాత వివాహబంధంతో ఒక్కటయ్యారు. బార్బరా-బుష్‌ దంపతులది 73 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితం. వారికి ఐదుగురు సంతానం (వీరిలో జార్జ్‌ బుష్‌ (జూనియర్‌) అమెరికా 43వ అధ్యక్షుడిగా పనిచేశారు). 17 మంది మనవళ్లు, మనవరాళ్లు, ఏడుగురు మునిమవళ్లు, మునిమనవరాళ్లు ఉన్నారు. కాగా బార్బరా పియర్స్‌ బుష్‌(93) ఈ ఏడాది ఏప్రిల్‌లో కన్నుమూశారు.

వ్యాపార- రాజకీయ జీవితం...
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన అనంతరం బుష్‌ కుటుంబం టెక్సాస్‌కు వెళ్లి స్థిరపడ్డారు. ఆ తర్వాత తండ్రి వ్యాపారాన్ని విస్తరించడంలో దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా 1953లో జపాటా పెట్రోలియం కార్పోరేషన్‌ అనే సంస్థను ప్రారంభించి 1966 వరకు దానికి చైర్మన్‌గా కొనసాగారు.

రిపబ్లికన్‌ పార్టీలో చేరిన బుష్‌.. 1963లో టెక్సాస్‌లోని హ్యారిస్‌ కంట్రీ చైర్మన్‌గా పదవి చేపట్టి రాజకీయ జీవితం ప్రారంభించారు. పౌర హక్కుల బిల్లు కోసం పోరాడిన బుష్‌.. 1966లో హౌజ్‌ ఆఫ్‌ రిప్రంజేటివ్స్‌కు ఎంపికయ్యారు. సెనేటర్‌గా, అమెరికా గూఢాచార సంస్థ(సీఐఏ) డైరెక్టర్‌గా, రొనాల్డ్‌ రీగాన్‌ హయాంలో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1989లో అమెరికా 41వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా జూనియర్‌ బుష్‌(బుష్‌ తనయుడు) తన తండ్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఎనిమిదేళ్లకే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం విశేషం.

కొడుకు జార్జ్‌ డబ్ల్యూ బుష్‌తో సీనియర్‌ బుష్‌

మరిన్ని వార్తలు